ఎన్నికల వేళ.. తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలు..!
X
తెలంగాణలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బీసీలకు లక్ష, మైనార్టీలకు లక్ష చొప్పున ఆర్థికసాయం ప్రకటించిన కేసీఆర్ సర్కార్.. మరికొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయాలకు ఆమోద్రముద్ర వేసే అవకాశం ఉంది.
ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పీఆర్సీ ఏర్పాటుపై చర్చించనుంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-2022 బిల్లుపై మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేబినెట్లో చర్చిస్తారు.అగస్ట్ 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో సభలో ప్రవేశపెట్టే బిల్లులపై కేబినెట్ చర్చించనుంది. మెట్రో రైలు పొడిగింపుపై కేబినెట్ చర్చించనుంది. పాతబస్తీలో మెట్రో రైలు పనులను త్వరగా పూర్తిచేస్తామని ఇటీవలె కేటీఆర్ ప్రకటించారు.అదేవిధంగా హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు చుట్టూ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది
ఆసరా పింఛన్ల పెంపు తదితర అంశాలపైనా కేబినెట్ చర్చింనుంది. గృహలక్ష్మి పథకంతోపాటు బీసీ, మైనారిటీబంధు అమలుపైనా చర్చ జరుగనుంది. ప్రభుత్వం పంపిన నాలుగు బిల్లులను గవర్నర్ తిప్పి పంపారు.. ఈ బిల్లుల్లో మార్పులు చేస్తూ రూపొందించిన ముసాయిదాపై కేబినెట్ చర్చించనుంది. బుద్వేల్ లో ఉన్న దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని.. హెచ్ఎండీఏ ద్వారా వేలం వేసే ప్రక్రియపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.