Home > తెలంగాణ > గతంలో కన్నా ఐదారు సీట్లు ఎక్కువే గెలుస్తాం : KCR

గతంలో కన్నా ఐదారు సీట్లు ఎక్కువే గెలుస్తాం : KCR

గతంలో కన్నా ఐదారు సీట్లు ఎక్కువే గెలుస్తాం : KCR
X

తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గత ఎన్నికల కన్నా ఈసారి ఐదారు సీట్లు ఎక్కువే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. సభకు హాజరైన జనాలను చూస్తే ఈసారి జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినట్లేనన్న నమ్మకం కలుగుతోందని చెప్పారు. ప్రజలు ఆగమాగం కావొద్దన్న కేసీఆర్.. ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలో ప్రజల మధ్య ఉండి పనిచేసే నాయకులు ఉన్నారని సీఎం కేసీఆర్ చెప్పారు.

విపక్షాల డ్రామాలు

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో విపక్షాలు డ్రామాలు మొదలుపెట్టాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. మోటర్లకు మీటర్ పెడ్తమని ఒకరంటే.. 3 గంటల కరెంటు సరిపోతదని మరొకరు అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు 50ఏండ్లు అవకాశమిస్తే ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీ హయాంలో సూర్యాపేట జిల్లా 60ఏండ్లు వెనక్కిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఇస్తున్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు.

ఫించన్ పెంచుతాం

గతంలో రూ.500 పెన్షన్ కూడా ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడు రూ. 4వేల ఫించన్ ఇస్తామని చెబుతోందని కేసీఆర్ మండిపడ్డారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా అంత మొత్తం పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. తాము కూడా పింఛను మొత్తాన్ని పెంచుతామన్న ముఖ్యమంత్రి ఎంత పెంచుతామన్నది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

అందుకోసమే ధరణి

రైతులు పైరవీల కోసం తిరగొద్దనే ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒకసారి భూమి వివరాలు ధరణిలో నమోదుచేస్తే వాటిని ఎవరూ మార్చలేరని చెప్పారు. అన్నదాతల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తున్నామని చెప్పారు. విపక్షాల మాటలు నమ్మి కాకుండా అబివృద్ధి చూసి ఓటేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.


Updated : 20 Aug 2023 2:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top