Home > తెలంగాణ > రేపు భారీ కాన్వాయ్‌‌తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్‌

రేపు భారీ కాన్వాయ్‌‌తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్‌

రేపు భారీ కాన్వాయ్‌‌తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్‌
X

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. రాష్ట్రంలో పలు బహిరంగ సభలు నిర్వహించారు. తాజాగా కేసీఆర్ మరోమారు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి(జూన్ 26, 27 తేదీల్లో) రెండు రోజుల పాటు కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా షోలాపూర్‌ జిల్లా పండరిపూర్‌లోని విఠోభారుక్మిణి మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే జిల్లాలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా కేసీఆర్ పాల్గొననున్నారు. కేసీఆర్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు భారీ కాన్వాయ్‌గా షోలాపూర్‌కు తరలి వెళ్లనున్నారు

కేసీఆర్ పర్యటన వివరాలు..

సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రానికి షోలాపూర్‌ చేరుకుంటారు. ఆ రోజు రాత్రి కేసీఆర్, ఇతర నాయకులు షోలాపూర్‌లోనే బస చేయనున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని పలువురు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడిన ప్రజలు.. కేసీఆర్‌ను కలవనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

మంగళవారం (జూన్ 27న) ఉదయం షోలాపూర్ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండరిపూర్‌కు కేసీఆర్ చేరుకోనున్నారు. అక్కడి విఠోభారుక్మిణి మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దాదాపు 400 మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ పూజల్లో పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది.

అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరనున్న కేసీఆర్.. దారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం రోడ్డుమార్గాన హైదరాబాద్‌కు చేరుకుంటారు.





Updated : 25 Jun 2023 2:47 PM IST
Tags:    
Next Story
Share it
Top