Revanth Reddy : మరికాసేపట్లో అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు సీఎం రేవంత్ బృందం
X
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు సందర్శించనున్నారు. వీరంతా అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు బస్సుల్లో బయలుదేరుతారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున నేరుగా అక్కడి నుంచే ఈ ఉదయం 10 గంటల తర్వాత రోడ్డు మార్గంలో వెళ్ళేలా షెడ్యూలు ఖరారైంది. రేవంత్ పర్యటనకు అన్ని పార్టీల శాసనసభ్యులను ఆహ్వానించారు. అయితే నల్లగొండలో సభ ఉన్న కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గైర్హాజరవుతున్నారు. బీజేపీ, మజ్లిస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం వేర్వేరు కారణాలతో ఈ టూర్‌కు దూరంగా ఉంటున్నారు.
షెడ్యూల్ ఇదే..
మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ వద్దకు ముఖ్యమంత్రితో సహా మంత్రులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు చేరుకుంటారు. 10.15కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి మేడిగడ్డ(Medigadda)కు బస్సులలో వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) దగ్గరకు ప్రజా ప్రతినిధుల బృందం చేరుకుంటారు. అనంతరం 2 గంటల పాటు సైట్ విజిట్ చేస్తారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అది ముగిసిన తరవాత 5 గంటలకు తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు సందర్శన ఉన్నందున మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గర అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
సీఎం వర్సెస్ మాజీ సీఎం..
సందర్శన అనంతరం సీఎం రేవంత్ మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడనున్నారు. సరిగ్గా అదే సమయంలో నల్లగొండ బహిరంగసభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రజలను ఉద్దేశించి కృష్ణా జలాలు, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో ప్రసంగించనున్నారు.పోటాపోటీగా ఈ రెండు కార్యక్రమాలు జరుగుతుండడంతో అధికార, విపక్ష పార్టీల మధ్య జల వివాదం సరికొత్త రూపం దాల్చుతున్నది.