Home > తెలంగాణ > CM Revanth Reddy: తెలంగాణకు ద్రోహం చేసిందే కేసీఆర్..

CM Revanth Reddy: తెలంగాణకు ద్రోహం చేసిందే కేసీఆర్..

CM Revanth Reddy: తెలంగాణకు ద్రోహం చేసిందే కేసీఆర్..
X

కేఆర్ఎంబీ కి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వ వివరణ ఇచ్చింది. విభజన చట్టంలో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణ, ఇతర అంశాలపై స్ఫష్టత ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్‌పై వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌, హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలను గందరగోళానికి గురి చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్‌ చెప్పారని, విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించడం జరిగిందన్నారు.

"గత ప్రభుత్వం ఏపీ సర్కారుకు లొంగి పోయింది. విభజన చట్టం 84 నుంచి 89 వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై స్పష్టంగా ఉంది. విభజన చట్టంలోని ప్రతీ అక్షరం తనను అడిగేరాశారని కేసీఆర్ గతంలో చెప్పారు. కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి రచయిత.ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడానికి 2014లోనే పునాది పడింది. చట్టం రూపొందించినప్పుడు లోక్ సభలో కేసీఆర్, రాజ్యసభలో కేకే ఉన్నారు. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యూనల్ ఆనాడు 811 టీఎంసీలను కేటాయించింది. రాష్ట్రం విడిపోయాక 811 టీఎంసీలను ఎలా పంచుకోవాలో ఇరు రాష్ట్రాల సీఎం లను సంప్రదించింది. 2015 లో ఇరు రాష్ట్రాల సీఎంలతో కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఏపీకి 512, తెలంగాణ కు 299 టీఎంసీ ల నీటిని పంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2015 లో జరిగిన సమావేశంలో తెలంగాణకు 299 టీఎంసీ ల నీరు చాలని సంతకాలు చేశారు. కృష్ణా జలాల్లో ఆనాడు 50 శాతం వాటా ఎందుకు అడగలేదు?" అని ప్రశ్నించారు సీఎం.

లెక్క ప్రకారం తెలంగాణకు 512 టీఎంసీ లు రావాలని, కానీ పూర్తి వ్యతిరేకంగా ఒప్పందం చేసుకొని ఏపీకి నీటిని ధారాదత్తం చేశారని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. "2015 నుంచి ఇప్పటివరకూ ఇదే ఒప్పందం కొనసాగింది. 2019లో మరీ బరితెగించి ప్రవర్తించారు. ప్రతీ ఏటా ఏం సంతకం పెడతాం అన్నట్లుగా మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టును కేఆర్ఎంబీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్లు 2022 మే 27న జరిగిన మీటింగ్ లో ఒప్పందం చేసుకున్నారు. కృష్ణానదిపై ఉన్న 15 ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నట్లు 2022లో ఒప్పుకున్నారు. కేఆర్ఎంబీ కి అప్పగించిన ప్రాజెక్టుల నిర్వహణకు 2023 బడ్జెట్ లో రూ.400 కోట్లు కేటాయించారు. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్‌ పార్లమెంట్‌లో ప్రశ్నించలేదు. ఇప్పుడు కృష్ణా నీటిలో 50 శాతం వాటా కావాలని అడుగుతున్నారు. పదవుల కోసం నోరు మూసుకున్నది మీరే" అని అన్నారు.

Updated : 4 Feb 2024 10:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top