కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ ఫోన్
X
సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్కారుకు కేంద్రం నుంచి సహకారం అందేలా చూడాలని సీఎం కోరారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను గురించి సీఎం రేవంత్ కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని సీఎం కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని సీఎం రేవంత్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని ముఖ్యులతో సమావేశం కావడానికి తనకు సహకరించాలని కేంద్రమంత్రిని సీఎం కోరినట్లు తెలుస్తోంది. పీఎం మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులను కలిసేందుకు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా హామీల అమలుకు కావాల్సిన నిధులపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలోని ఆదాయ వనరులతో పాటు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ సాయం కోరేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసినట్లు సమాచారం అందుతోంది.