పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన ఆందోళన కలిగిస్తోంది.. సీఎం రేవంత్
X
పార్లమెంట్లో ఇవాళ జరిగిన దుండగుల దాడిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇది పార్లమెంట్ భవనంపైనే కాదు దేశ ప్రజాస్వామ్య విలువలపై దాడి అని సీఎం అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను సీఎం రేవంత్ కోరారు. కాగా ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. మరొకరి కోసం గాలింపు చేపట్టారు. కాగా మధ్యాహ్నం లోక్ సభలో జీరో అవర్ జరుగుతుండగా విజిటర్స్ గ్యాలరీలో నుంచి ఇద్దరు ఆగంతకులు లోపలికి దూసుకొచ్చారు.
ఎంపీల సీట్ల నుంచి జంప్ చేస్తూ కలర్ స్మోక్ ను వదిలారు. దీంతో ఎంపీలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక బయటకు పరుగులు తీశారు. ఇక కొంతమంది ఎంపీలు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. తాజా ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సరిగ్గా 22 ఏళ్ల కందట ఇదే రోజున ఉగ్రవాదులు పార్లమెంట్ పై దాడి చేశారు. ఈ దాడిలో 9మంది అమరులయ్యారు. ఈ క్రమంలోనే నేటి దాడికి 2001 డిసెంబర్ 13నాటి దాడితో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.