Home > తెలంగాణ > Mynampally Hanumanth Rao : మైనంపల్లికి కాంగ్రెస్ తీర్థం రేవంత్ పుణ్యమే.. తెరవెనక ఏం జరిగిందంటే?

Mynampally Hanumanth Rao : మైనంపల్లికి కాంగ్రెస్ తీర్థం రేవంత్ పుణ్యమే.. తెరవెనక ఏం జరిగిందంటే?

Mynampally Hanumanth Rao : మైనంపల్లికి కాంగ్రెస్ తీర్థం రేవంత్ పుణ్యమే.. తెరవెనక ఏం జరిగిందంటే?
X

బీఆర్ఎస్‌కు బైబై చెప్పి రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా సహకరించారా? కష్టాల్లో ఉండిన రేవంత్‌కి కూడా మైనంపల్లి తన చేతనైన సాయం చేశారా? ఇద్దరి మధ్య పరస్పర సహాయ సహకారాలతో దశాబ్దాల నుంచే కాస్త బాహాటంగా, కాస్త చాటుమాటుగా సాగిన బంధం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరి బలమైన షేక్‌హ్యాండ్‌గా మారిందా? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం చెబుతున్నాయి ఇద్దరి రాజకీయ జీవితాలు.

పసుప్పచ్చ బంధం నుంచి..

రేవంత్, మైనంపల్లి టీడీపీలో ఉన్నప్పటి నుంచి దగ్గరి స్నేహితులు. 2018 ఎన్నికల్లో రేవంత్ కొడంగల్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయాక మాల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా మైనంపల్లి కేడర్ రేవంత్ విజయం కోసం కష్టపడి పనిచేసిందని అందరూ చెబుతున్న మాటే. మైనంపల్లి బీఆర్ఎస్‌లో ఉంటూనే రేవంత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. రేవంత్ సహకారంతో మైనంపల్లి మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లలో తన కేడర్‌ను విస్తరించుకున్నారు. ఆ శ్రేణులు తిరిగి రేవంత్‌కు సహకరించాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఈ పరస్పర సహకారం కొనసాగాల్సి ఉండింది. అయితే బీఆర్ఎస్ తనకు మాత్రమే టికెట్ ఇచ్చిన కొడుకు రోహిత్ రెడ్డికి మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో మైనంపల్లి తిరుగుబాటు చేసి తెగతెంపులు చేసుకున్నారు. బీఆర్ఎస్‌తో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరకముందే రేవంత్.. మైనంపల్లికి కాంగ్రెస్ తీర్థం పోయడానికి రంగం సిద్ధం చేశారు.

తెరవెనక భేటీలు

మైనంపల్లితోపాటు బీఆర్ఎస్ అంసతృప్త నేత పొంగలేటి శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్‌కు పరిచయం చేసి మంతనాలు జరిపించినట్లు తెలుస్తోంది. దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబులు కూడా హస్తం తరఫున రంగంలోకి దిగి డీల్ కుదిర్చినట్లు సమాచారం. కేరళ కాంగ్రెస్ నేతలు సహాయ, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఈ తతంగానికి సహకరించారని చెబుతున్నారు. మైనంపల్లి గులాబీ జెండాను వదలకముందే కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలును జైపూర్‌లో కలిసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మైనంపల్లి తనకు మల్కాజ్‌గిరి టికెట్‌ను, కొడుక్కి మెదక్ టికెట్‌ను, సన్నిహితుడు నక్కా ప్రభాకర్‌ను మేడ్చల్ టికెట్‌ను కోరినట్లు సమాచారం.

అందరికీ రెండు కావాలి.

అయితే ఒక వ్యక్తికి ఒక పదవే అంటున్న కాంగ్రెస్ ఏకంగా మూడు టికెట్లు ఇస్తుందా అన్నది ఆసక్తికర అంశం. ఒక కుటుంబం నుంచి రెండో వ్యక్తికి టికెట్ ఇవ్వాలంటే ఆ వ్యక్తికి పార్టీలో ఐదేళ్ల నిర్వహణ అనుభవం ఉండాలని 2022నాటి కాంగ్రెస్ ఉదయపూర్ ‘నవ్ సంకల్ప్’ డిక్లరేషన్ చెబుతోంది. మైనంపల్లి కోసం దాన్ని పక్కన పెడతారా, పెడితే ఇంతవరకు హస్తాన్నే నమ్ముకున్న కేడర్ మైనంపల్లికి ఎంతమేరకు సహకరిస్తుందన్నది ఆసక్తికరం. రెండు టికెట్లు కోరుతున్న నేతలు కాంగ్రెస్‌లో చాలామందే ఉండడంతో హైకమాండ్ టికెట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటోందని చెబుతున్నారు. జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి నాగార్జునసాగర్, లేదా మిర్యాలగూడ టికెట్‌ను కోరుతున్నారు. చిన్నకొడుకు కూడా సాగర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాజనర్సింహ ఈసారి తన కూతురు త్రిషకు కూడా టికెట్ ఆశిస్తున్నారు. సీతక్క కూడా తనకు ములుగు టికెట్, కొడుకు సూర్యకు పినపాక టికెట్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ జాబితాలో కొండా సురేఖ, మురళి దంపతులు, పి. జనార్దన్ రెడ్డి కొడుకు కూతుళ్లు విష్ణువర్ధన్, విజయతోపాటు మరెందరో ఉన్నారు. ఒక కుటుంబానికి రెండు ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోతే తిరుగుబాట్లు లేచే పరిస్థితి. ఇన్ని సమస్యల నడమ మైనంపల్లి డిమాండ్ నెరవేరుతుందో లేదో అభ్యర్థుల జాబితా వచ్చేవరకు వేచి చూడాలి. మరో ఆసక్తికర విషయం ఏమంటే మైనంపల్లి ఇదివరకే ఒకసారి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ఆ ఏడాది ఏప్రిల్ 8న కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి అదే రోజు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో అదే రోజు రాజీనామా చేశారు!


Updated : 25 Sept 2023 10:09 PM IST
Tags:    
Next Story
Share it
Top