Home > తెలంగాణ > Telangana Congress: గెలుపే లక్ష్యంగా.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తుది సర్వే

Telangana Congress: గెలుపే లక్ష్యంగా.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తుది సర్వే

Telangana Congress: గెలుపే లక్ష్యంగా.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తుది సర్వే
X

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్‌(Election Notification) వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలవడమే ఏకైక లక్ష్యంగా.. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో తుది సర్వేకు సిద్ధమైంది. అంతకుముందుకు కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు జరిపిన సర్వే(Sunil Kanugolu Survey)లపై పలువురు సీనియర్‌ నేతలు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. స్క్రీనింగ్‌ కమిటీలో సైతం సీనియర్లు సర్వే ఫలితాలపై అనుమానాలు లేవనెత్తటంతో వాటిని నివృత్తి చేసేందుకు ఏఐసీసీ మరోసారి సర్వేలు జరుపుతోంది

ఈ సారి.. ఒక్క బృందంతో కాకుండా మూడు టీంలు రంగంలోకి దిగి, ఈ ఫ్లాష్‌ సర్వేలు నిర్వహించబోతున్నాయి. ప్రధానంగా ఏఐసీసీ ప్రతినిధిగా సునీల్‌ కనుగోలు బృందం, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ టీం, గాంధీ కుటుంబం నుంచి మరో బృందం రాష్ట్రంలో ఈ సర్వేలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రతి నియోజకవర్గంలో 500లోపు మాత్రమే నమూనాలు సేకరించి, సర్వే జరపగా.. ఈసారి 3వేల వరకు శాంపిల్స్‌ తీసుకుని సర్వే నిర్వహిస్తున్నారు. పార్టీ గెలుపులో గెలుపు గుర్రాల ఎంపికకు సర్వేలే కీలకమైనందున స్క్రీనింగ్‌ కమిటీ భేటీ తరచూ వాయిదా పడుతోంది. తాజా సర్వేల ఫలితాలు వచ్చిన వెంటనే స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమై.. మొదటి జాబితాకు చెందిన పేర్లను ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించనుంది.

పార్టీలోని సీనియర్లే కాదు.. కొత్తగా పార్టీలో చేరిన నాయకుల బలాబలాలపై కూడా ఈ ఫ్లాష్‌ సర్వే కొనసాగనుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సర్వేలు పూర్తై నివేదికగా అందజేయగా.. శుక్ర, శనివారాల్లో మిగతా నివేదికలు వస్తే ఈ నెల 8న స్క్రీనింగ్‌ కమిటీ భేటీ అయ్యే అవకాశముంది. స్థానిక నాయకత్వానికి సంబంధం లేకుండా అత్యంత రహస్యంగా ఈ ప్రక్రియ సాగుతోంది. కాంగ్రెస్‌ వర్గాల సమాచారం మేరకు 70మంది అభ్యర్థులతో తొలి జాబితా వచ్చే అవకాశం ఉంది.

అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకటికి రెండు మూడు సార్లు సర్వేలు జరిపి.. గెలిచే సత్తా ఉన్న నాయకులకే సీట్లు ఇవ్వాలనే యోచనలో ఉంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న టీ కాంగ్రెస్‌.. కమిటీల వారీగా పరిశీలన చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన స్క్రీనింగ్‌ కమిటీ.. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసింది. గతంలో చేసిన సర్వేలపై స్క్రీనింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్న రాష్ట్ర నాయకులు అనుమానాలు వ్యక్తం చేయటం.. పార్టీలో చేరేందుకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న క్రమంలో పలు నియోజకవర్గాల్లో మరోసారి ఫ్లాష్‌ సర్వేను చేపట్టింది.

Updated : 6 Oct 2023 2:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top