Home > తెలంగాణ > సీడబ్ల్యూసీలో టీ కాంగ్రెస్‌కు మొండిచేయి.. లిస్ట్ ఇదే..

సీడబ్ల్యూసీలో టీ కాంగ్రెస్‌కు మొండిచేయి.. లిస్ట్ ఇదే..

సీడబ్ల్యూసీలో టీ కాంగ్రెస్‌కు మొండిచేయి.. లిస్ట్ ఇదే..
X

జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడీబ్ల్యూసీ)ని పునర్వ్యవస్థీకరించారు. కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన ఈ కమిటీని ఆదివారం దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి(Rajiv Gandhi Jayanti) సందర్భంగా ప్రకటించారు. ఈ కమిటీలో ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ సహా.. గతంలో అధినాయకత్వంపై అసమ్మతి గళం వినిపించిన జీ-23 నేతలు శశిథరూర్‌, ఆనంద్‌శర్మ వంటి వారికి కూడా స్థానం కల్పించారు. 39 మంది రెగ్యులర్‌ సభ్యులతోపాటు 32 మందికి శాశ్వత ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. వీరిలో 12 మంది వివిధ రాష్ట్రాల పార్టీ ఇన్‌చార్జులు ఉన్నారు.

ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఏపీ నుంచి రఘువీరా రెడ్డికి చోటు కల్పించగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మొండిచేయి చూపించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ కమిటీలో తమకూ సభ్యత్వం దక్కుతుందని ఆశలు పెట్టుకున్న రాష్ట్ర సీనియర్‌ నేతలకు నిరాశే మిగిలింది. ఒకరిద్దరు సీనియర్‌ నేతల పేర్లను సభ్యత్వం కోసం పార్టీ పరిశీలించినా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చివరి క్షణంలో పక్కన పెట్టినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన సమయంలో ఈ పదవి రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఒకరిద్దరు నేతలు దీనిపై ఆశలు పెట్టుకున్నారు. ఇతర రాష్ట్రాలకు పార్టీ ఇన్‌ఛార్జి లేదా సీడబ్ల్యూసీలో సభ్యత్వం ఏదో ఒకటి ఇవ్వాలని పలుమార్లు అధిష్ఠానానికి కొందరు విన్నవించినట్లు సమాచారం. అయినా కూడా పార్టీ వారందర్నీ పక్కనబెట్టింది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బిరామి రెడ్డిని శాశ్వత ఆహ్వానితుడిగా ఖర్గే ప్రకటించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు , చల్లా వంశీచందర్ రెడ్డి పేర్లను ప్రకటించినా.. రేవంత్ , ఉత్తం వర్గాలను నిరాశపరిచింది.

39 మంది కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుల్లో మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌, రాహుల్‌ గాంధీ, అధిర్‌ రంజన్‌చౌధురి, ఏకే ఆంటోనీ, అంబికా సోని, మీరా కుమార్‌, దిగ్విజయ్‌ సింగ్‌, పి.చిదంబరం, తారిక్‌ అన్వర్‌, లాల్‌ తన్వాలా, ముకుల్‌ వాస్నిక్‌, ఆనంద్‌ శర్మ, అజయ్‌ మాకెన్‌, ప్రియాంకా గాంధీ, కుమారి శెల్జా, గైఖంగం, అభిషేక్‌ మనూసింఘ్వీ, సల్మాన్‌ ఖుర్షీద్‌, జైరాం రమేశ్‌, జితేంద్ర సింగ్‌, రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా, దీపక్‌ బబారియా, కేసీ వేణుగోపాల్‌, అవినాశ్‌ పాండేలను యథాతథంగా కొనసాగించారు. కొత్తగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ, రెబల్‌ ఎంపీ శశిథరూర్‌, ఛత్తీస్‌గడ్‌ హోంమంత్రి తామ్రధ్వజ్‌ సాహు, రాజస్థాన్‌ కీలకనేత సచిన్‌ పైలట్‌, పశ్చిమబెంగాల్‌కు చెందిన మాజీ కేంద్ర మంత్రి దీప్‌ దాస్‌ మున్షీ, రాజస్థాన్‌ మంత్రి మహేంద్రజీత్‌ సింగ్‌ మాల్వీయ, లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉపనేత గౌరవ్‌ గొగోయి, కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌, మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యే కమలేశ్వర్‌ పటేల్‌, గుజరాత్‌కు చెందిన మాజీ ఎంపీ జగదీష్‌ ఠాకూర్‌, జమ్మూకశ్మీర్‌కు చెందిన గులాం అహ్మద్‌ మిర్‌లు ఉన్నారు.

Updated : 21 Aug 2023 8:06 AM IST
Tags:    
Next Story
Share it
Top