Home > తెలంగాణ > MLA Quota MLC Elections: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫిక్స్..!

MLA Quota MLC Elections: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫిక్స్..!

MLA Quota MLC Elections: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫిక్స్..!
X

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ఇవాళ ప్రకటించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయచటంతో ఖాళీ ఏర్పడింది. ఈ రెండు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది కాగా మరొకటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినదిగా ఉన్నది. దీంతో వీటిని భర్తీ చేసే విషయంలో ఒకటి ఎస్సీ, మరొకటి ఓసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థానాలకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌లను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

శనివారం టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోపాటు ఇతర అధిష్ఠానం పెద్దలతో ఎమ్మెల్యేల కోటాతోపాటు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల అంశంపై చర్చలు జరిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు మహేశ్‌కుమార్‌గౌడ్‌, అద్దంకి దయాకర్‌తోపాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కార వేణుగోపాల్‌, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, పటేల్‌ రమేశ్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ల పేర్లను అధిష్ఠానం ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో దయాకర్, మహేశ్‌కుమార్ పేర్లను ఫైనల్ చేసే అవకాశమున్నదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ అవకాశం రానివారికి కేబినెట్ హోదా లేదా దానికి తగిన స్థాయి ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్‌లుగా చేస్తామని హామీ ఇచ్చేలా పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నది. ఈ రెండు స్థానాలకు ఈ నెల 29న ఎన్నిక జరగనున్నది.

ఇక గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీట్లకు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సియాసత్‌ న్యూస్‌ ఎడిటర్‌ ఆమెర్‌ అలీఖాన్‌ల పేర్లను అధిష్ఠానం ప్రధానంగా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ముస్లిం మైనారిటీ వర్గం వారు ఒక్కరు కూడా లేకపోవడంతో.. నాలుగు ఎమ్మెల్సీల్లో ఒకటి కచ్చితంగా ఆ వర్గానికి కేటాయించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఇందుకోసం మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకూడదని పార్టీ పరంగా నియమం ఉండడంతో రేసులో వారిద్దరు వెనుకపడ్డారు. ఒకవేళ ముస్లిం మైనారిటీని ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రివర్గంలోనూ చోటు కల్పించాలని అధిష్ఠానం భావిస్తే మాత్రం.. షబ్బీర్‌ అలీకి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కవచ్చన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.




Updated : 15 Jan 2024 8:53 AM IST
Tags:    
Next Story
Share it
Top