Home > తెలంగాణ > జోరు పెంచిన కాంగ్రెస్.. ఖర్గే నేతృత్వంలో వచ్చే వారం చేవెళ్లలో భారీ సభ..

జోరు పెంచిన కాంగ్రెస్.. ఖర్గే నేతృత్వంలో వచ్చే వారం చేవెళ్లలో భారీ సభ..

జోరు పెంచిన కాంగ్రెస్.. ఖర్గే నేతృత్వంలో వచ్చే వారం చేవెళ్లలో భారీ సభ..
X

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ జోరు పెంచింది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇందిరా భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో మీటింగ్లతో పాటు ఈ నెల చివరి వారంలో చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది.

నియోజకవర్గాలవారీగా

ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. తిరగబడదాం.. తరిమికొడదాం కార్యక్రమాన్ని గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నేతలకు ఆదేశించారు. ఇందుకోసం పార్లమెంటు నియోజకవర్గాలవారీగా కో ఆర్టినేటర్లను సైతం నియమించినట్లు చెప్పారు.

చేవెళ్లలో ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్

ఇదిలా ఉంటే ఈ నెల 26న చేవెళ్లలో ప్రజా గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరవుతారని చెప్పారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానున్న ఆ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తామని అన్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు.

ప్రియాంకతో మహిళా డిక్లరేషన్

ఆగస్టు చివరి వారంలోనే వరంగల్ లో మరో భారీ సభ నిర్వహించనున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఈ నెల 29న వరంగల్ వేదికగా మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు చెప్పారు. ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామన్న ఆయన.. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఉమెన్ డిక్లరేషన్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మేనిఫెస్టో విడుదలకు సోనియా గాంధీని ఆహ్వానించనున్నట్లు రేవంత్ చెప్పారు. నెల రోజుల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.




Updated : 19 Aug 2023 1:06 PM GMT
Tags:    
Next Story
Share it
Top