బాండ్పై సంతకం చేస్తేనే బీ ఫామ్.. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాంగ్రెస్ ప్లాన్..!
X
కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో కొత్త జోష్ కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన నేతలు అధికారం చేజిక్కించుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్న కాంగ్రెస్ ఎన్నికల తర్వాత పార్టీ తరఫున గెలిచిన నేతలెవరూ చేజారిపోకుండా పక్కా ప్లాన్ సిద్ధం చేస్తోంది. లీగల్ ఎక్స్ పర్ట్స్ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు సాగుతోంది.
బాండ్ పేపర్పై సంతకం
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరి నుంచి బాండ్ పేపర్ మీద సంతకాలు తీసుకోవాలని కాంగ్రెస్ డిసైడైంది. ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీ మారనని, ఒకవేళ మారాల్సి వస్తే పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాయించుకునేందుకు సిద్ధమైంది. చట్టపరంగా ఎలాంటి లొసుగులకు ఆస్కారం లేకుండా లీగల్ ఎక్స్పర్ట్స్ సలహాలు సూచనలు తీసుకొని బాండ్ పేపర్ రాయించనుంది. హైకమాండ్ ఆదేశాల మేరకు పార్టీ టిక్కెట్ తీసుకోనున్న నేతలంతా బీ - ఫాం తీసుకునే ముందు ఆ బాండ్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విధానంపై టీ-కాంగ్రెస్‌లోని కొందరు లీడర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అయితే ఎన్నికల తర్వాత పార్టీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఇలాంటివి అవసరమేనని మరికొందరు నాయకులు అంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల నుంచి అమలు
వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలప్పుడే కాంగ్రెస్ ఈ బాండ్ పేపర్ సిస్టం అమలు చేస్తోంది. అయితే గ్రేటర్ పరిధిలో ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే గెలవడం, వాళ్లు కరుడు కట్టిన కాంగ్రెస్‌వాదులు కావడంతో ఆ బాండ్‌ను బ్రేక్ చేయలేదు. దీంతో ఇంతకాలం ఆ విధానంపై పార్టీలో పెద్దగా చర్చ జరగలేదు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ పొందే ప్రతి నేత ముందుగానే సైన్ చేయించుకుంటామని చెప్పడంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు బాండ్ల వ్యవహారాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేసింది. పార్టీలో కొత్తగా చేరే నేతలకు సైతం ఈ విషయాన్ని వివరించి, వారు ఓకే చెప్పిన తర్వాతే కాంగ్రెస్ కండువా కప్పనున్నట్లు సమాచారం.
అనుభవం నేర్పిన పాఠం
2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల అనంతరం మరో 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇది కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్ రావు, హరిప్రియా నాయక్, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, జాజుల సురేందర్ హర్షవర్థన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలు పదవులు, ఆర్థిక ప్రయోజనాలకు లొంగి బీఆర్ఎస్‌లో చేరారనని గతంలో టీ-కాంగ్రెస్అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరినా.. చట్టపరంగా, శాసన సభ నియమాలపరంగానీ ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి తప్పిదాలు మళ్లీ పునరావృతం కావద్దన్న భావనతో కాంగ్రెస్ హైకమాండ్ ఈ బాండ్ విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.