కాంగ్రెస్ ప్రభుత్వంలోకి కామ్రేడ్ మంత్రి!
X
తెలంగాణలో తమ పార్టీ ప్రభావం ఉన్న చోటల్లా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకుని వెళ్తోందని ప్రశంసించారు. మంగళవారం నారాయణ, కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మరో నేత చాడ వెంకటరెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశయ్యారు. తర్వాత విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాలని ఆహ్వనం వస్తే ఆలోచిస్తామన్నారు. తమకు పొత్తు ధర్మం కింద రెండు ఎమ్మెల్సీ సీట్లు వస్తాయని, ఒక ఎమ్మెల్యే ఉన్నారని నారాయణ అన్నారు.
‘‘ప్రజలు మార్పు కోరారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలను వేధించారు. హామీలను తుంగలో తొక్కారు. పర్యాటక శాఖలో వందల కోట్ల అవినీతి జరిగింది. ఆధారాలు బయటపడతాయని కాల్చేశారు. మా పార్టీని ప్రజలు ఆదర్శిస్తున్నారు. మాతో పొత్తు కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది.’’ అని ఆరోపించారు. ఏపీతో ఏ పార్టీతో పొత్తుపెట్టుకుంటారని అడగ్గా ఇంకా ఆలోచించలేదన్నారు. తెలంగాణలో ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీపీఐకి కొత్తగూడెం సీటును కేటాయించింది. పొత్తుకు ముందు సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించి భంగపడ్డాయి.