Home > తెలంగాణ > బీఆర్ఎస్ తొలి జాబితా… కామ్రేడ్లకు టెన్షన్ టెన్షన్..

బీఆర్ఎస్ తొలి జాబితా… కామ్రేడ్లకు టెన్షన్ టెన్షన్..

బీఆర్ఎస్ తొలి జాబితా… కామ్రేడ్లకు టెన్షన్ టెన్షన్..
X

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా అంటూ బయటికొచ్చిన పేర్లు కలకలం రేపుతున్నాయి. చాలామంది సిట్టింగులు సంబరపడుతుంటే సస్పెన్స్‌లోని పెట్టిన స్థానాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు పదిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ గల్లంతవుతుందనే అంచనాలు ఈ జాబితా రావడండంతో మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. దీన్ని ఎవరు లీక్ చేసి ఉంటారు, ఇదసలు నిజమైన జాబితానే అనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క కారుతో పొత్తుకోసం వెంపర్లాడుతున్న కమ్యూనిస్టులు కూడా ఈ జాబితా చూసి డోలయమానంలో పడ్డారు. ఆశించిన స్థానాలు దక్కుతాయనే ఆశతో, కొన్నిపై ఆశ వదులకోక తప్పదనే నిరాశతో అధికార జాబితా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

తనకు ప్రతిష్టగా మారిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలను కమ్యూనిస్టుల సాయంతో బీఆర్ఎస్ గట్టెక్కాక పొత్తు అంశం తెరపైకి వచ్చింది. బీజేపీని నిలువరించడానికి కారుతో కలసి పోరాడాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించాయి. కేసీఆర్‌కు వాటి సాయం అక్కర్లేకపోయినా పొత్తు అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆ రెండు పార్టీలకు చెరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లను కేటాయిస్తామని బీఆర్ఎస్ ప్రతిపాదించింది. అయితే తమకు చెరో మూడు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలన్న కామ్రేడ్లు పట్టుబడుతున్నారు. చర్చలు కొలిక్కి రాలేదు. ఈలోగా ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడింది. బలంలేని కమ్యూనిస్టులకు ఏకంగా ఆరు సీట్లు వదులుకోవడానికి గులాబీ బాస్ సిద్ధంగా లేరు. సీపీఎంకు భద్రాచలం, సీపీఐకి మునుగోడు మాత్రమే ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ఎర్ర పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తమ హైకమాండ్లను సంప్రదించగా, మరిన్ని సీట్లు అడగాలని ఆదేశాలు అందాయట. పాలేరు, మిర్యాలగూడలను కూడా తమకివ్వాలని సీపీఎం పార్టీ బేరమాడుతోంది. మునుగోడుతోపాటు బెల్లంపల్లి, కొత్తగూడెం సీట్లను తమకు కేటాయించాలని సీపీఐ కోరుతోంది.

బయటికొచ్చిన జాబితాలో పాలేరుకు అభ్యర్థి పేరు కూడా ఉండడంతో సీపీఎం ఆశలు గల్లంతైనట్లే. ఇక ఆశ పెట్టుకున్న భద్రాచలం, మునుగోడు, కొత్తగూడెం, మిర్యాలగూడ, బెల్లంపల్లికి ‘జాబితా’లో అభ్యర్థులు లేకపోవడంతో రెడ్స్ ధీమాగానే ఉన్నారు. ఆయా స్థానాల్లో గులాబీ సిట్టింగులు, ఆశావహులు భారీస్థాయిలో తమ వంతు ప్రయత్నాలు చేస్తుండడంతో అవైనా దక్కుతాయా లేదా అని సందిగ్ధంలో పడ్డారు. శ్రావణ సోమవారం మంచి రోజు కాబట్టి రేపు కేసీఆర్ జాబితా విడుదల చేస్తారని వార్తలు వస్తుండంతో ఏం చేయాలో దిక్కుతోచక గంటలు లెక్కబెడుతున్నారు. పొత్తును లాంఛనంగా కుదుర్చుకముందే విడుదల చేయడం సరికాదని లోలోపల సణుక్కుంటున్నా, ఇచ్చిందే పదివేలు అనుకున్నట్టు ఉంది ఒకప్పటి ప్రధాన విపక్షమైన కామ్రేడ్ల పరిస్థితి!

Updated : 20 Aug 2023 2:23 PM IST
Tags:    
Next Story
Share it
Top