రాష్ట్రంలో నేటితో ముగియనున్న దశాబ్ది ఉత్సవాలు
X
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి 10 వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా... కేసీఆర్ సర్కార్ ఈ నెల 2 నుంచి దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. గత మూడు వారాలుగా వైభవంగా, పండుగ వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ 21 రోజులూ.. రోజుకో రంగం చొప్పున ఆయా రంగాల వారీగా దినోత్సవాలను నిర్వహిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులను ప్రజలకు వివరించారు. తొమ్మిదేళ్ల హయంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు చేకూర్చిన లబ్ధి వివరిస్తూ కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ్టితో దశాబ్ది వేడుకలు ముగియనున్నాయి.
ఉత్సవాల్లో చివరి రోజైన ఇవాళ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఊరూరా అన్ని స్థానిక సంస్థల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానం చేస్తారు. అన్ని విద్యాలయాల్లోనూ ప్రార్థనా సమావేశంలో అమరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించాలని తెలిపారు. సాయంత్రం హైదరాబాద్‌లో అమరుల గౌరవార్థం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో అమరుల స్మారకం వరకు జరిగే ర్యాలీలో... 5000కు పైగా కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శిస్తారు. సచివాలయం ఎదుట నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం 6:30 గం.లకు ప్రారంభిస్తారు. తెలంగాణ అమరుల స్మారకం – అమర దీపం ప్రజ్వలన కార్యక్రమం ఘనంగా జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
సాయంత్రం ముగింపు వేడుకల్లో సీఎం ప్రసంగించనున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ రోజు జరగబోయే కార్యక్రమంలో తెలంగాణ మలిదశ పోరాట తొలి అమరుడు శ్రీకాంతా చారి కుటుంబానికి గౌరవం దక్కనుంది. ఆఖరి రోజు జరగబోయే ఈ వేడుకకు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఆహ్వానం అందించింది కేసీఆర్ ప్రభుత్వం. శ్రీకాంత్ చారి తల్లి కాసోజు శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.