టీచర్లకు బయోమెట్రిక్ హాజరు విధానం రద్దు.. కారణమిదే
X
రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఉపాధ్యాయులకు అమలవుతున్న బయోమెట్రిక్ హాజరు విధానాన్ని విద్యాశాఖ రద్దుచేసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 16వ తేదీతో ఉత్తర్వులు జారీకాగా మంగళవారం బయటకు వచ్చాయి. ఈ నెల 15న విద్యాశాఖ కార్యదర్శి నుంచి నోట్ ఆర్డర్లు రావడంతో.. ఆ మరుసటి రోజే సంచాలకురాలు ఆదేశాలు జారీచేశారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టకుండా బయోమెట్రిక్ హాజరును రద్దు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. బయోమెట్రిక్ పరికరాలు సరిగా పనిచేయడం లేదని, ఫేస్ రికగ్నిషన్ హాజరును అమలు చేస్తామని శ్రీదేవసేన చెప్పారు.
అయితే గత నెల ఆగష్టులో ప్రభుత్వం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే నెల నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ట్యాబ్‌లలో ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను ఇన్ స్టాల్ చేసి, వీటి ఆధారంగా హాజరును నమోదుచేస్తామని చెప్పింది. కేవలం విద్యార్థుల హాజరునే కాకుండా.. ఉపాధ్యాయుల ముఖ కవళికల రిజిస్ట్రేషన్ తో వారి హాజరు వివరాలను కూడా సెంట్రల్ సర్వర్‌లో నమోదయ్యేలా ప్లాన్ చేసింది. అయితే హాజరు అప్‌లోడింగ్‌కు ఇంటర్నెట్ అవసరం. చాలా గ్రామీణ ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగా ఉండవు. దీంతో ఫేస్ రికగ్నిషన్ అమలు పూర్తిస్థాయిలో సాధ్యం కాదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.