Home > తెలంగాణ > నేడే ఆఖరు.. మరికొన్ని గంటల్లో అమల్లోకి 144 సెక్షన్

నేడే ఆఖరు.. మరికొన్ని గంటల్లో అమల్లోకి 144 సెక్షన్

నేడే ఆఖరు.. మరికొన్ని గంటల్లో అమల్లోకి 144 సెక్షన్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈరోజు సాయంత్రంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం కానుంది. 2 నెలలుగా హోరెత్తిన మైకులు సాయంత్రం 5 గంటల తర్వాత మూగబోనున్నాయి. బహిరంగ సభలు, రోడ్‌ షోలు, సమావేశాలకు ఫుల్‌‌స్టాప్ పడనుంది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారాన్ని ముగించాల్సి ఉంది. మంగళవారం సాయంత్రం 5గంటల తరువాత అభ్యర్థులు, పార్టీల నాయకులు బహిరంగ, అంతర్గతంగా గానీ ప్రచారం చేసుకోవడానికి వీలుండదు.ప్రచారానికి చివరి రోజు కావడంతో.. ప్రధాన పార్టీల నాయకులంతా ఓటర్లను ఎలాగైనా తమ వైపునకు తిప్పుకునేలా భారీ బహిరంగసభలను, రోడ్ షో లను ప్లాన్ చేశాయి. మిగిలిన కొద్ది గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ప్రచార పర్వం చివరి రోజున సీఎం కేసీఆర్.. ఇవాళ వరంగల్‌, గజ్వేల్‌లో పర్యటిస్తారు. అక్కడ నిర్వహించే బీఆర్ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని, ప్రసంగిస్తారు. ఉదయం11:30కి వరంగల్‌ ఈస్ట్‌, మధ్యాహ్నం 3:30కి గజ్వేల్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇక బీజేపీ తరఫున జాతీయ నేతలు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌షిండే ఆదిలాబాద్‌, బోథ్‌, ధర్మపురి ప్రచారంలో , దేవేంద్ర ఫడ్నవీస్‌ దేవరకొండ, పాలకుర్తి, నర్సంపేట బీజేపీ సభలకు హాజరవుతారు. హనుమకొండలో కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్‌, సంగారెడ్డిలో కేంద్రమంత్రి భగవత్‌ ఖరద్‌, నిజామాబాద్‌లో అన్నామలై ప్రచారం చేస్తారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మాదే అంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు చివరి రోజు హైదరాబాద్‌పై ఫోకస్ చేశారు. జూబ్లీహిల్స్‌, నాంపల్లి, మల్కాజిగిరిలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ. జహీరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో ప్రియాంకగాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు.

మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్‌ అమల్లోకి రానుంది. అలాగే 48 గంటల పాటు మద్యం షాపులను సైతం మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 28వ తేదీ సాయంత్రం 5 నుంచే 30వ తేదీ సాయంత్రం 5 వరకు సైలెంట్‌ పీరియడ్‌లో టీవీ, సోషల్‌ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదని, పత్రికల్లో వేసే ప్రకటనలకు ఎంసీఎంసీ (మోడల్‌ కోడ్‌ మీడియా కమిటీ) ముందస్తు అనుమతి పొంది ఉండాలని ఎన్నికల అధికారులు వెల్లడించారు. 119 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కోసం ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. 8 జిల్లాల పరిధిలో 600కు పైగా పోలింగ్‌ కేంద్రాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి... అదనపు బలగాలను మోహరించారు.

Updated : 28 Nov 2023 7:54 AM IST
Tags:    
Next Story
Share it
Top