రాష్ట్రంలో అత్యధిక, అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గాలివే
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో ఎండ్ కార్డ్ పడింది. ఇక గురువారం(రేపు) జరుగబోయే పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ దృష్టి పెట్టింది. పోల్ మేనేజ్‌మెంట్లపై పార్టీలు దృష్టి సారించాయి. బూత్‌ల వారీగా నేతల ప్రణాళికలు వేసుకుంటున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల ఎన్నికల బరిలో 2,290మంది అభ్యర్ధులు పోటీలో నిలబడటంతో ఆసక్తి నెలకొంది. అత్యధికంగా ఎల్బీనగర్ లో 48మంది ఎన్నికల బరిలో ఉండగా.. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడ నియోజకవర్గాల్లో 7 గురు పోటీలో ఉన్నారు.
ఇక అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల గురించి చెప్పాలంటే.. రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 6,98,133 మంది ఓటర్లున్నారు.ఇక్కడ పురుష ఓటర్లు 3,70,361మంది, మహిళా ఓటర్ల సంఖ్య 3,27,636. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 142 మంది ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండడంతో ఇక్కడ 622 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక శేరిలింగంపల్లి తర్వాతి స్థానాల్లో కుత్బుల్లాపూర్‌లో 6,69,253 మంది, మేడ్చల్‌లో 5,95,536 మంది, ఎల్బీనగర్‌లో 5,66,866 మంది, రాజేంద్ర నగర్‌లో 5,52,455 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత మహేశ్వరంలో 5,17,316 మంది, ఉప్పల్‌లో 5,10,345 మంది ఓటర్లున్నారు. రాష్ట్రంలోని మరే అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఓటర్ల సంఖ్య 5 లక్షలు దాటలేదు.
అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో భద్రాచలం మొదటి స్థానంలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం(ఎస్టీ) నియోజకవర్గం ఓటర్ల సంఖ్య పరంగా తెలంగాణలోనే అత్యంత చిన్న అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ మొత్తం 1,46,016 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అశ్వరావు పేటలో 1, 53,808 మంది ఓటర్లు, బెల్లంపల్లిలో 1, 69,759 మంది ఓటర్లు, చెన్నూరులో 1, 84, 250 మంది ఓటర్లు, వైరాలో 1,90,950 మంది ఓటర్లు, బాన్సువాడలో 1,93, 032 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పినపాకలో 1,94,145 మంది ఓటర్లు, దుబ్బాకలో 1,94, 722 మంది ఓటర్లు, జుక్కల్‌లో 1,98,035 మంది ఓటర్లు ఉన్నారు.