Home > తెలంగాణ > Telangana Assembly Elections: 608 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

Telangana Assembly Elections: 608 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

Telangana Assembly Elections: 608 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ
X

ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన ముగిసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4,798 మంది నామినేషన్లు వేయగా.. మెుత్తం నామినేషన్లలో 608 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి కె.జానారెడ్డి, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ భార్య జమున, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరించిన నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

నాగార్జునసాగర్‌‌లో జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఇక హుజూరాబాద్‌లో బీజేపీ తరపున ఈటల రాజేందర్, కోరుట్లలో విద్యాసాగర్ రావు కుమారుడు సంజయ్ బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్నారు. అయితే ముందు జాగ్రత్తగా వీరు డమ్మీ నామినేషన్లు దాఖలు చేయగా.. వీటిని తరస్కరించినట్లు తెలిసింది. అలంపూర్‌ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి రిజైన్ చేయకుండానే నామినేషన్‌ వేశారని ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. అధికారులు తోసిపుచ్చారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమర్పించిన అఫిడవిట్‌ నిబంధనల మేరకు లేదంటూ కాంగ్రెస్‌ పార్టీ లేవనెత్తిన అభ్యంతరాలను కూడా అధికారులు తిరస్కరించారు.

పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్వినికి మూడు వేర్వేరు చిరునామాలు ఉన్నాయంటూ భారాస ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. నిబంధనల మేరకు అలా చిరునామాలు ఉండవచ్చంటూ అభ్యంతరాలను అధికారులు తోసిపుచ్చారు. దేవరకద్రలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మధుసూదన్‌రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉందంటూ బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. రెండో ఓటు రద్దు చేయాలంటూ ఆయన దరఖాస్తు చేసుకుని ఉండటంతో నామినేషన్‌ను అధికారులు ఆమోదించారు.

Updated : 14 Nov 2023 4:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top