Home > తెలంగాణ > రెండవ విడతలో లక్షా 30 వేల మందికి దళిత బంధు.. సీఎం కేసీఆర్

రెండవ విడతలో లక్షా 30 వేల మందికి దళిత బంధు.. సీఎం కేసీఆర్

రెండవ విడతలో లక్షా 30 వేల మందికి దళిత బంధు.. సీఎం కేసీఆర్
X

అనేక సవాళ్ళు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం నేడు పరుగులు తీస్తోందన్నారు కేసీఆర్. ఇందుకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, ప్రజా సహకారమే కారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఆచరణీయంగా ఉందన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. దళిత బంధు పథకం కింద ఇప్పటివరకు 50 వేల మంది లబ్దిదారులకు 5 వేల కోట్ల రూపాయలను అందించినట్టుగా సీఎం చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్ లో ఈ పథకానికి 17,700 కోట్లు కేటాయించామన్నారు. రెండవ విడత లక్షా 30 వేల మందికి దళిత బంధు పథకం అందిస్తామన్నారు.

ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్

బీసీ కుల వృత్తుల కుటుంబాలకు కుటుంబానికి రూ. లక్ష ఆర్ధిక సహాయం అందిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా రజక, నాయిబ్రహ్మణ, విశ్వ బ్రహ్మణ, కుమ్మరి, మేదర తదితర సామాజిక వర్గాలు దీంతో ప్రయోజనం పొందనున్నారని సీఎం చెప్పారు. ఆరేళ్ళ స్వల్ప కాలంలోనే వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించిందన్నారు. దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మార్మోగుతున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా మన్ననలందుకుంటుందన్నారు.

క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు ఇక్కడ లేవ్

విద్యుత్తు రంగంలో తెలంగాణ విప్లవాత్మక విజయాలు సాధించిందని ఆయన గుర్తు చేశారు. 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన చెప్పారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తూ రైతు సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంటుందన్నారు. మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ప్రకటిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు లేవన్నారు.తెలంగాణ ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుంటే, నేడు ప్రస్తుతం 18,453 మెగావాట్లకు పెంచుకోగలిగినట్టుగా కేసీఆర్ ప్రస్తావించారు.

ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నాం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80శాతం పైగా పూర్తయిందన్నారు.. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలలో ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుందని సీఎం చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి చేసినట్టుగా కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. . త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేసి రైతుల పంట పొలాలకు సాగునీరు అందించనున్నట్టుగా కేసీఆర్ వివరించారు. రైతుల నుండి ఇప్పటివరకు ఒక కోటి ఇరవై ఒక లక్షల కోట్ల విలువైన ఆరు కోట్ల డెబ్భై ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్టుగా సీఎం చెప్పారు. . కేంద్రం నిరాకరించినా, తెలంగాణ ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తుందన్నారు

దేశంలో అధిక వేతనం పొందుతున్నది మన ఉద్యోగులే

ఎంఎన్‌సీ ఉద్యోగాలు సాధించే స్థాయికి గురుకులాలు ఎదిగాయని సీఎం అన్నారు. స్వల్ప వ్యవధిలోనే వైద్య, ఆరోగ్య సేవల ప్రమాణాలు పెంచామని.. ఆరోగ్య సూచీల్లో రాష్ట్రం అద్భుత పురోగతి సాధించిందన్నారు. పాలనా సంస్కరణలు సత్వర అభివృద్ధికి చోదకశక్తిగా మారాయన్నారు. దేశంలో అధిక వేతనం పొందుతున్నది మన ఉద్యోగులేనని చెప్పారు. 20 వేల వీఆర్ఏల క్రమబద్ధీకరణ, 9,355 మంది జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ కొనసాగుతోందన్నారు. టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్రం గమ్యస్థానమైందని చెప్పారు.

హైదరాబాద్‌ అభివృద్ధి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు

హైదరాబాద్‌ నగర అభివృద్ధి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారన్నారు కేసీఆర్‌. హరితహారంలో 9 ఏళ్లలో 273 కోట్ల మొక్కలు నాటామని, హరితహారంతో 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్‌కు రెండుసార్లు గుర్తింపు లభించిందని.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 19న హరితోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అతిపెద్ద మానవ ప్రయత్నంగా హరితహారానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించిందని.. 9 ఏళ్లలో విద్యారంగంలో అద్భుత ఫలితాలు సాధించిందన్నారు.

Updated : 2 Jun 2023 6:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top