Home > తెలంగాణ > టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. త్వరలో తెలంగాణ టెట్ నోటిఫికేషన్

టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. త్వరలో తెలంగాణ టెట్ నోటిఫికేషన్

టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. త్వరలో తెలంగాణ టెట్ నోటిఫికేషన్
X

బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు టెట్ పరీక్ష నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం దీనికి ఆమోదం తెలిపింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. టెట్ నిర్వహణపై వెంటనే కసరత్తు ప్రారంభించాలని మంత్రి వర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది. దాదాపు 22 వేల పోస్టుల భర్తీకి సంబంధించిన అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే టీచర్ల ట్రాన్స్‎ఫర్లు, ప్రమోషన్‎ల ప్రక్రియ పూర్తి కాకుండా కొత్తగా నియామకాలు చేపట్టలేమని అధికారులు మంత్రులకు వివరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ నిరుద్యోగుల్లో అసంతృప్తిని పోగొట్టాలనే ఉద్దేశంతో తక్షణమే టెట్‌ నిర్వహించాలని మంత్రులు భావించినట్టు తెలిసింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం 2016లో మొదటిసారిగా టెట్ పరీక్షను నిర్వహించింది సర్కార్. ఆ తరువాత 2017, 2022లలోనూ టెట్ పరీక్ష నిర్వహించారు. గత సంవత్సరం టెట్‌ పరీక్ష సమయంలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నాయన్న ఆశతో ఎక్కువ మంది పరీక్ష రాశారు. కానీ ఏడాది గడచినా ఎలాంటి నియామకాలు జరగలేదు. 2016 నుంచి టెట్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన వారంతా ఉద్యోగాల భర్తీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు అయితే కానీ కొత్త నియామకాలు చేపట్టలేమని విద్యాశాఖ చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో నియామకాల ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 22వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన లక్షల మంది అర్హులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే నియామకాలు చేపట్టవచ్చు. ఇవేవీ చేయకుండా టెట్‌ చేపడితే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది?

Updated : 8 July 2023 2:48 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top