Home > తెలంగాణ > Medaram : మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు..తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Medaram : మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు..తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Medaram : మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు..తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
X

మేడరం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మక్క సారలమ్మ భక్తులకు దేవాదాయ శాఖ ఆన్ లైన్ ద్వారా మొక్కులు చెల్లించే వెసులుబాటును కల్పించింది. అమ్మవారిని దర్శించుకోలేని భక్తుల కోసం నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. భక్తులు వారి బరువు ప్రకారం కిలోకు రూ.60 చొప్పున.. ఎన్ని కిలోలు ఉంటే అంత మొత్తం చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పణను బుక్ చేసుకోవచ్చు. నిలువెత్తు బంగారం సమర్పించేందుకు.. ఓ వ్యక్తి 50 కేజీలు ఉంటే.. బరువు ప్రకారం రూ.3000, మీ సేవా ఛార్జీలు రూ.35, పోస్టల్ ఛార్జీలు రూ.100 కలిసి మొత్తంగా రూ.3,135 చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మేడారం జాతర ఆన్‌లైన్ సేవలు, ఇంటి నుంచే నిలువెత్తు బంగారం సమర్పణ సేవలను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా మేడారం జాతర ప్రసాదం సైతం పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు.

అంతేకాదు పోస్ట్ ద్వారా మేడారం ప్రసాదంను పొందే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు దేవాదాయ శాఖ వారు వెల్లడించారు. మేడారం జాతరకు నేడు అంకురార్పణ జరిగింది. గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం ప్రారంభమైంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగే తంతు నిర్వహిస్తారు. గుడిమెలిగేలో భాగంగా మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండేళ్లకోసారి జరిగే ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం పండుగ ఈ నెల 21న ప్రారంభమై నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది.మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇదివరకే మంత్రులు మేడారం వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని సైతం మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆసియాలోనే అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందిన ఈ వేడుకకు ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం జాతరకు తరలి వస్తారు. కోటి మందికి పైగా సందర్శించుకునే సమ్మక్క సారలమ్మ జాతరకు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 8 Feb 2024 1:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top