మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు షాక్.. గన్‌మెన్ల తొలగింపు
X
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని తొలగిస్తూ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు పోలీస్ శాఖకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద ఉన్న గన్‌మెన్‌లను పోలీస్ శాఖ వెనక్కి పిలిపించింది. అయితే అవసరమైన వారికి మళ్లీ సెక్యూరిటీని పునరుద్ధరించే అవకాశం ఉంది.
మరోవైపు.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పోలీస్ శాఖ గన్‌మెన్‌లను కేటాయించింది. ఇక ఎవరెవరికి గన్‌మెన్స్ అవసరమనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ విభాగం ఒక నివేదిక సమర్పించనుంది. అనంతరం భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని వారికి సెక్యూరిటీ అవసరమా కాదా అనే విషయాన్ని తేల్చనున్నారు. భద్రత అవసరం అని భావించిన వారికి మళ్లీ గన్‌మెన్‌లను కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పాలనపై పూర్తి స్థాయి దృష్టిసారించింది. గత ప్రభుత్వంలో ఏర్పడిన లోటుపాట్లను సవరించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలకు తెరలేపుతున్నారు. అధికారుల బదిలీలు, కొన్ని శాఖల్లో సమూల మార్పులు, గతంలో జరిగిన అవకతవకలపై విచారణలు, పలువురు కీలక అధికారుల బదిలీలు వంటి చర్యలు చేపడుతున్నారు.