Rythubandhu: ఈసారి కాస్త ముందుగానే రైతుబంధు సాయం
'మరో రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ నిర్ణయం'
X
రాష్ట్రంలోని అన్నదాతలకు శుభవార్త. పెట్టుబడి సాయం కింద రైతులకు కేసీఆర్ సర్కార్ అందించే రైతుబంధు సాయం ఈసారి కాస్త ముందుగానే అందనుంది. ఈ వానకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు సాయాన్ని గతంలో కంటే ముందే రైతులకు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో పంట సీజన్‌లను ముందుకు జరపాలని నిర్ణయించి కార్యాచరణ చేపట్టిన ప్రభుత్వం దీనికి అనుగుణంగా అన్నదాతలను సన్నద్ధం చేసేందుకు వీలుగా రైతుబంధును కూడా ముందుగానే విడుదల చేసే అంశంపై దృష్టి సారించింది. దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
రైతుబంధు పథకం కింద వానాకాలం, యాసంగి సీజన్‌లకు ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏటా మొత్తం రూ.10 వేల సాయాన్ని 63 లక్షల మందికి అందజేస్తోంది. ఏటా వానాకాలం సీజన్‌కు జూన్ ఆఖరి వారంలోలేదం జులై మొదటి వారంలో నిధులను విడుదల చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టాలు సంభవించిన నేపథ్యంలో మున్ముందు ఈ సమస్య రాకుండా నివారించేందుకు పంట సీజన్‌లను ముందుకు జరపాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తు సీజన్ ఏర్పాట్ల కోసం సన్నద్ధం అయ్యేలా వారికి రైతుబంధు సాయాన్ని ముందే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం మరో రెండురోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.