రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఒక డీఏ విడుదల చేసిన సర్కారు
X
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏ విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో డీఏ మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల మూల వేతనం, పెన్షన్‌పై 2.73 శాతం డీఏ పెరగనుంది. పెరిగిన డీఏ 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు హరీష్ రావు ప్రకటించారు.
ప్రభుత్వం ఉద్యోగుల జూన్ నెల వేతనం, పెన్షన్‌తో పాటు పెరిగిన డీఏను జూలైలో చెల్లించనుంది. బకాయిలను మాత్రం తర్వాత విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. డీఏ పెంపుతో రాష్ట్రంలోని 7.28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. డీఏ పెంపు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ. 81.18 కోట్లు.. ఏడాదికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడుతుందని హరీశ్‌రావు చెప్పారు. పెంచిన డీఏ ప్రకారం 2022 జనవరి 1 నుంచి చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.1,380 కోట్లు ఉంటుందని అన్నారు.