ఆశా వర్కర్లకు, ఏఎన్‌ఎంలకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్
X
రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు గుడ్‌న్యూస్. ఆశా వర్కర్లకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆశా వర్కర్లతో పాటు సెకండ్ ఏఎన్‌ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం.. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలకు సంబంధించి జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి.. ఈ అంశంపై అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆరోగ్య సేవలను అందించేందుకు ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు బాగా కృషి చేస్తున్నారని, వారి సేవలు మరువలేనివని హరీష్ రావు ప్రశంసించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ధి వేడుకల సందర్భంగా జూన్ 14న తెలంగాణ ఆరోగ్య దినోత్సం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ రోజు విజయవంతం కావడానికి రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలందరూ సహకరించాలని కోరారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడుసార్లు ఆశా వర్కర్లకు జీతాలు పెంచి ప్రస్తుతం రూ.9,750 ఇస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4 వేల నుంచి రూ.5 వేలు మాత్రమే వారికి ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.