Irrigation department: శ్వేతపత్రం విడుదలకు ముందే ప్రక్షాళన..!
X
గురువారం నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రేపు ఉదయం 11.30 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే మొదటి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళిసై స్పీచ్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టును సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే మరోవైపు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీయడానికి బీఆర్ఎస్ సిద్ధం అవుతుంది.
కాగా అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజే తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టింది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా.. రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లును తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా.. ఈఎన్‌సీ జనరల్ మురళీధర్‌రావు రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఇక పదవీ విరమణ చేసిన తర్వాత కూడా సర్వీసులో కొనసాగుతోన్న ఈఎన్‌సీ మురళీధర్‌రావును రాజీనామా చేయాలని మంత్రి ఆదేశించారు. మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టులకు పని చేశారు. ఇటీవల మురళీధర్‌ను పదవి నుంచి తొలగించి.. విచారిస్తే ప్రాజెక్టుల అక్రమాలు బయటకు వస్తాయని పలు డిమాండ్లు వెల్లువెత్తాయి. మరికొందరు ఇంజినీర్లపైనా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.