బిల్లులు తిరస్కరించడానికి ఓ కారణముంది.. గవర్నర్ తమిళిసై
Thumb: వివాదాలు సృష్టించాలన్నది నా ఉద్దేశం కాదు
X
రాష్ట్రంలో యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. సోమవారం రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఎన్నో సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోవడం ఆందోళనకరమని అన్నారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని వీసీలకు సూచించారు. ఉన్నత విద్యారంగంలో నూతన విధానాలను అమలు చేయాల్సిన బాధ్యత వీసీలపై ఉందన్నారు. వర్సిటీల్లో మౌలిక సదుపాయాలు మెరుగుర్చాలని ఆదేశించారు. యూనివర్సిటీలు, ఆయా వర్సిటీల పరిధిలో కాలేజీల్లో క్లాస్ రూమ్స్, ల్యాబ్ రూమ్స్, టాయిలెట్స్, డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచాలన్నారు. ఉత్తమ పనితీరు కనబర్చే యూనివర్సిటీలకు అవార్డులు అందిస్తామని తెలిపారు.
వివాదాలు సృష్టించాలన్నది తన ఉద్దేశం కాదని.. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రైవేటు యూనివర్సిటీల బిల్లులు తిరస్కరించడం, అనుమతించడం చేస్తున్నానని ప్రస్తావించారు. ప్రభుత్వంతో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పిన గవర్నర్.. వీసీలకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని కోరారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధినుల మృతిపై నివేదిక ఇవ్వాలని ఇంచార్జీ వీసీని ఆదేశించానని తెలిపారు.
యూనివర్సిటీల్లో ప్రపంచంతో పోటీపడేందుకు నాణ్యమైన ఉన్నత విద్యతోపాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని సూచించారు. స్టూడెంట్లకు మానసిక ఒత్తిళ్లు నుంచి బయటపడేసేందుకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. పోటీ పరీక్షలు వాయిదా పడుతున్న దృష్ట్యా తెలంగాణ యువతకు ఆత్మస్థైర్యం కల్పించాలని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ విజ్ఞప్తి చేశారు.