Governor Tamilisai: రైతు రుణమాఫీపై రాష్ట్ర గవర్నర్ కీలక ప్రకటన
X
యూపీఏ ప్రభుత్వమే తెలంగాణను ఏర్పాటు చేసిందని, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు అని తెలిపారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగిస్తూ.. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని అసెంబ్లీలో ప్రకటించారు. ప్రతి పంటకు మద్ధతు ధర ఇస్తామన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామన్నారు. భూమాత పోర్టల్ అత్యంత పారదర్శకంగా ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపిస్తామని, తొమ్మిదేళ్లలో అప్పులతో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారన్నారు. దుబారా ఎక్కడ జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నామని తెలిపారు. వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతామని, దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే తమ లక్ష్యమని చెప్పారు.
నిరుద్యోగుల కలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని, అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షల మేరకే పాలన సాగుతుందని చెప్పారు. ఆరు నెలల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని సభలో ప్రకటించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, డ్రగ్స్ పై తమ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని చెప్పారు. వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామన్నారు. త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు గవర్నర్.