కేసీఆర్ సర్కార్‌కు షాక్.. గవర్నర్ సంచలన నిర్ణయం!!
X
ఆర్టీసీ బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలపలేదని తెలుస్తుంది. ఈ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ బిల్లు ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. కానీ 2 రోజులు గడుస్తున్నా ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపలేదని..రాజ్ భవన్ నుంచి ఎలాంటి అనుమతి రాలేదని తెలుస్తుంది. దీనితో ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని భావించిన కేసీఆర్ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది.
కాగా ఇటీవల కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటి. అలాగే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆర్టీసీ విలీన ప్రతిపాదనను గవర్నర్ కు పంపించారు. అసెంబ్లీ సెషన్ ముగిసేలోగా గవర్నర్ కాన్సెంట్ చెప్పాలి. కానీ.. రెండు రోజులుగా గవర్నర్ స్పందించడం లేదు.
ఇక గవర్నర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారుపై వ్యతిరేక వైఖరితోనే ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల్లోని బడుగు, బలహీన వర్గాల వారిని ఇబ్బంది పెట్టేలా గవర్నర్ వ్యవస్థ వ్యవహరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.