కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్
X
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఊహించని షాక్ తగిలింది. ఈ నెల 17న తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన జయభేరి సభకు దేవాదాయ శాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. సభ నిర్వహించే స్థలం.. దేవాదాయశాఖకు చెందిన భూమి కావడం వల్ల రాజకీయ సభలకు అనుమతి ఇవ్వలేమని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ యాక్ట్ -1988లోని సెక్షన్ 5, 6 ప్రకారం గుడులు, ప్రార్థనా మందిరాల పక్కన రాజకీయ సభలకు అనుమతి ఇవ్వరాదని, అందుకే కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వాస్తవానికి తెలంగాణ విమోచన దినోత్సవం రోజున జయభేరి సభను.. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అదే రోజు ఇతర రాజకీయపార్టీల సభలు ఉండటంతో.. సభ ఏర్పాటుకు అధికారులు అనుమతి నిరాకరించారు. తాజాగా తుక్కుగూడ వద్ద 50 ఎకరాలకుపైగా భూమిలో సభ ఏర్పాటు కోసం కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంది. అయితే తాజాగా అనుమతి ఇవ్వలేమని చెప్పారు అధికారులు. దీంతో కాంగ్రెస్ నాయకులు మరో స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పక్కనే ప్రైవేట్ స్థలం ఉండడంతో అక్కడ సంబంధిత భూయజమానులతో అనుమతి తీసుకుని, సభ నిర్వహణకు అనుమతి కోసం ప్రయత్నం చేస్తున్నారు.
తాము మొదట పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టుకోవాలని దరఖాస్తు చేసుకుంటే.. దానిని కాంగ్రెస్‌కు ఇవ్వకుండా బీజేపీ(BJP), బీఆర్ఎస్ కుట్ర చేశాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తాము నిర్వహించబోతున్న కార్యక్రమాలకు ఏలాంటి ఆటంకాలు కలిగించకుండా..కేసీఆర్(KCR) రాజకీయ విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. ఈ నెల 16, 17న నిర్వహించబోయే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ- సీడబ్ల్యుసీ సమావేశాలకు, జయభేరి బహిరంగసభకు పటిష్ఠ భద్రత కల్పించాలని డీజీపీ అంజనీకుమార్‌ను కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.