Home > తెలంగాణ > రుణమాఫీకి మరో రూ.వెయ్యి కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం

రుణమాఫీకి మరో రూ.వెయ్యి కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం

రుణమాఫీకి మరో రూ.వెయ్యి కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
X

రైతు రుణమాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం బుధవారం మరో రూ. వెయ్యి కోట్లు విడుదల చేసింది. రూ. 1.20 లక్షల రుణాలున్న రైతులకు సంబంధించి రూ.99,999 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన వెయ్యి కోట్లతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 21.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.11,812 కోట్ల రుణాలను మాఫీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 29.61 లక్షల రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆగస్టు 3న ఆ ప్రక్రియను ప్రారంభించింది.

స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ఒక్కరోజే రూ.5,809 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ఆ ఒక్కరోజే రూ.లక్ష లోపు రుణం ఉన్న 9 లక్షల మంది రైతులు రుణవిముక్తులయ్యారు. ఇంకా మరో 8.26 లక్షల మందికి మరో రూ. 8 వేల కోట్ల మేరకు మాఫీ కావాల్సి ఉంది. రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 19 వేల కోట్లు వెచ్చించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, వాటిని పరిష్కరిస్తూ అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

ఇదిలా ఉండగా.. రుణమాఫీ పొందిన రైతులకు వెంటనే కొత్తగా పంట రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. రుణమాఫీ ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, వాటి పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.




Updated : 21 Sept 2023 7:46 AM IST
Tags:    
Next Story
Share it
Top