Home > తెలంగాణ > CM Breakfast: ఇడ్లీ సాంబార్‌, ఉప్మా, పూరి.. బడి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్

CM Breakfast: ఇడ్లీ సాంబార్‌, ఉప్మా, పూరి.. బడి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్

CM Breakfast: ఇడ్లీ సాంబార్‌, ఉప్మా, పూరి.. బడి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్
X

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. దసరా కానుకగా విద్యార్థుల కోసం ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ అనే సరికొత్త పథకాన్ని ఈరోజు(శుక్రవారం) నుంచే ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్‌ఎస్‌లో విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని వెస్ట్‌ మారేడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 8.30కి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. శుక్రవారమే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ప్రారంభిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేస్తారు.

ప్రతీ స్కూల్‌లోనూ ఉదయం 8 గంటల నుంచే అల్పాహారం పెట్టనున్నారు. ఇలా వారంలో ఆరో రోజుల పాటు విద్యార్ధులకు బ్రేక్ ఫాస్ట్ పెడతారు అధికారులు. మరి రోజూవారీగా ఉన్న వెరైటీలు , బ్రేక్ ఫాస్ట్ మెనూ ఏంటో చూసేద్దాం..

సోమవారం: ఇడ్లీ సాంబార్‌/ గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ

మంగళవారం: పూరి, ఆలు కుర్మా/ టమాటా బాత్‌, చట్నీ

బుధవారం: ఉప్మా,సాంబార్‌/ కిచిడీ, చట్నీ

గురువారం: మిల్లెట్‌ ఇడ్లీ, సాంబార్‌ / పొంగల్‌, సాంబార్‌

శుక్రవారం: ఉగ్గాని/ పోహా/మిల్లెట్‌ ఇడ్లీ, చట్నీ/ కిచిడీ, చట్నీ

శనివారం: పొంగల్‌, సాంబార్‌/వెజ్‌ పలావ్‌, రైతా/ఆలు కుర్మా

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ప్రతీ రోజూ పౌష్టికాహారం అందించే దిశగా సీఎం కేసీఆర్.. ఈ నూతన పధకాన్ని అమలులోకి తీసుకొస్తున్నారు. అల్పాహారానికి 45 నిమిషాల సమయం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జంట నగరాలైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో ప్రతీ స్కూల్.. ఉదయం 8.45 గంటలకు మొదలై.. మధ్యాహ్నం 3.45 గంటలకు పూర్తవుతుంది. ట్విన్ సిటీలు మినహా రాష్ట్రంలోని మిగిలిన స్కూల్స్ ఉదయం 9.30 గంటలకు స్టార్ట్ అయ్యి.. సాయంత్రం 4.15 గంటలకు పూర్తవుతాయి. అలాగే స్కూల్ మొదలయ్యే 45 నిమిషాలు ముందుగా స్టూడెంట్స్‌కు బ్రేక్ ఫాస్ట్ పెట్టడం మొదలుపెడుతారు. విద్యార్ధుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పోషకాహార లోపాన్ని పరిష్కరించేందుకు ఈ పధకాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ అల్పాహార పధకం అమలులోకి వస్తే.. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావడం, డ్రాపౌట్‌లు తగ్గడం లాంటివి కూడా మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక ఈ సీఎం 'అల్పాహారం' కు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో ప్రారంభించనున్నారు. దీనివల్ల 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. స్కూళ్ల ప్రారంభానికి అరగంట ముందు విద్యార్థులకు అల్ఫాహారాన్ని వడ్డిస్తారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని కొన్ని పాఠశాలల్లో అక్షయపాత్ర సంస్థ ద్వారా, మిగిలిన జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ద్వారా అల్పాహారాన్ని అందజేయనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌, కోడిగుడ్లను అందిస్తున్న విషయం తెలిసిందే.

Updated : 6 Oct 2023 8:29 AM IST
Tags:    
Next Story
Share it
Top