Home > తెలంగాణ > రంగులుమార్చే ఊసరవెళ్లి చీర...తెలంగాణ చేనేత కళాకారుడి అద్భుతమైన ప్రతిభ

రంగులుమార్చే ఊసరవెళ్లి చీర...తెలంగాణ చేనేత కళాకారుడి అద్భుతమైన ప్రతిభ

రంగులుమార్చే ఊసరవెళ్లి చీర...తెలంగాణ చేనేత కళాకారుడి అద్భుతమైన ప్రతిభ
X

గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను సృష్టించి చేనేత రంగంలో తన ప్రతిభను చాటారు సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల పరంధాములు. ఆయన వారసత్వాన్నే ఆయన కుమారుడు నల్ల విజయ్ కొనసాగిస్తున్నారు. చేనేత రంగంలో ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. తన తండ్రిదారిలోనే నడుస్తున్న విజయ్ తాజాగా అద్భుతమైన చీరను ఆవిష్కరించారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే చీరను రూపొందించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈయన ప్రతిభను చూసి ఐటీ శాఖ మంత్రి పొగడ్తలతో ముంచేశారు. ఇలాంటి అద్భుతాలు మరిన్ని సృష్టించాలంటూ ఆకాంక్షించారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‎లో ఇవాళ మంత్రి కేటీఆర్ నేత కళాకారుడు నల్ల విజయ్ రూపొందించిన ఊసరవెల్లి చీరను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కళను అభినందించారు.

ఈ ఊసరవెల్లి చీరను తయారు చేసేందుకు 30 గ్రాముల బంగారాన్ని, 500 గ్రాముల వెండిని వినియోగించారు. వీటితో పాటే విభిన్న రంగులు మారే పట్టు పోగులను సుమారు 30 రోజుల పాటు శ్రమించి తయారు చేశారు. ఈ చీర తయారు కావడానికి రూ.2.80లక్షలు అయ్యిందని విజయ్ తెలిపారు. రంగులు మారే ఈ చీర పొడవు 6,30 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు ఉంటుంది. 600 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ప్రముఖ బిజినెస్‎మెన్ దూరపుడి విష్ణు, విజయ్‎లోని టాలెంట్‎ను గుర్తించి తనకొరకు ఈ స్పెషల్ చీర ఆర్డర్ ఇచ్చారు. గతంలోనే విజయ్ చేనేత రంగంలో అద్భుతాలు ఆవిష్కరించారు. విజయ్ సుగంధాలు వెదజల్లే చీరను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అతిత్వరలోనే రూ.25 లక్షల ఖరీదు పలికే మరో అద్భుతమైన చీరను రూపొందించనున్నట్లు తెలిపారు.




Updated : 25 Sep 2023 4:20 PM GMT
Tags:    
Next Story
Share it
Top