రాష్ట్రంలో 14కు చేరిన కొవిడ్ కేసులు.. వైద్య శాఖ అప్రమత్తం
X
కరోనా మహమ్మారి దేశాన్ని మరోమారు కలవరపెడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి పెరిగింది. కేరళలో కొవిడ్ వేరియంట్ జేఎన్.1 కేసులు గుర్తించిన నేపథ్యంలో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా తాజాగా ముగ్గురు మరణించారు. ఈ మూడు మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. తాజాగా మరణాలతో కలుపుకొని దేశవ్యాప్తంగా కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 5,33,327కు పెరిగింది.
ఇక రాష్ట్రంలో కూడా గడిచిన 24 గంటల్లో 6 కొవిడ్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 538 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 6గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య 14కు చేరగా, ఒకరు రికవరీ అయినట్లు స్పష్టం చేసింది. మొత్తం 6 కేసులు హైదరాబాద్‌కు చెందినవి కావడం గమనార్హం. ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్న కేసుల్లో ఒకటి కరీంనగర్‌కు చెందినది కాగా మిగతా అన్ని హైదరాబాద్ నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న విషయం.
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల మంత్రులతో కొవిడ్ సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహా, అనంతరం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. వైద్యులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.