కొందరు హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారు..హరీష్ రావు
X
ఉస్మానియా వైద్యులు, అధికారులతో సమీక్ష చేసిన అనంతరం మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్రంలో వైద్యరంగంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు మంత్రి. కానీ, కొంతమంది రాజ్యాంగ పదవిలో ఉండి కూడా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మంత్రి చెప్పారు.
మీడియాతో మంత్రి మాట్లాడుతూ.." తెలంగాణలో వైద్య సేవలు అద్భుతంగా అందుతున్నాయి. ఎన్నో రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. నిమ్స్‌లో ఖాళీలు లేకుండా సిబ్బందిని నియమించాం. రాజకీయాప్రమోయం లేకుండా చేశాం. అద్భుతమైన ఫ్యాకల్టీని కూడా నిమ్స్‌కు అందించాం. తెలంగాణ వచ్చాక వైద్యసేవలన్నీ డబుల్ అయిపోయాయి. ఇన్ పేషంట్స్ , ఔట్ పేషంట్స్ సంఖ్య పెరిగింది. సంవత్సరానికి 25వేల సర్జరీలు జరుగుతున్నాయి. నిమ్స్ లో రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ప్రారంభించాం . దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీ సేవలు అమలవుతున్నాయి. గొప్ప గొప్ప డాక్టర్లు నిమ్స్‌లో పనిచేస్తున్నారు. వారం రోజుల్లో కొత్త నిమ్స్ బిల్డింగ్ పనులను ప్రారంభిస్తాం. కొంతమంది మంచిని వినలేరు, మంచిని చూడరు.
హాఫ్ నాలెడ్జ్‌తో విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. అభివృద్ధి జరగకపోతే నిమ్స్‌కు ఆలిండియా ర్యాంకులు ఎందుకొస్తున్నాయి". అని మంత్రి తెలిపారు.