దత్తత వెళ్తే ఆస్తిలో హక్కు ఉండదు.. హైకోర్టు సంచలన తీర్పు
X
దత్తత వెళ్లిన పిల్లలకు అసలు తల్లిదండ్రుల ఆస్తిపై హక్కులు ఉండవని హైకోర్టు పేర్కొంది. దత్తత వెళ్లినప్పటికీ.. తాను జన్మించిన కుటుంబం ఆస్తిలో వాటా ఉంటుందంటూ ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన ఎ.వి.ఆర్.ఎల్.నరసింహారావు ఖమ్మం సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ఆ కోర్టు.. జన్మించిన కుటుంబంలోని ఆస్తిలో వాటా ఉంటుందంటూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నరసింహారావు సోదరుడు ఎ.నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ నగేశ్ భీమపాకలతో కూడిన ఫుల్‌బెంచ్ సుదీర్ఘంగా విచారించి ఇటీవల తీర్పు వెలువరించింది.
ఒక వ్యక్తి రెండు కుటుంబాల్లో ఉండరని, అలాంటప్పుడు ఆస్తిలో హక్కు ఉండదని పేర్కొంది. హిందూ చట్టాల ప్రకారం దత్తత చేసినట్టయితే జన్మించిన కుటుంబంతో సంబంధాలన్నీ తెగిపోతాయని ఆ తీర్పులో పేర్కొన్నది. ఒకసారి దత్తతకు వెళ్లినప్పుడు పుట్టిన కుటుంబంతో ఉన్న సంబంధాలన్నింటినీ వారు తెంచుకుంటారని, దత్తత తీసుకున్న కొత్త కుటుంబ బంధాలను పొందుతారని చట్టం చెబుతోందని తెలిపింది. పుట్టిన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేనప్పుడు ఆస్తిలో హక్కు పొందజాలరని పేర్కొంది. దత్తతకు వెళ్లకముందు భాగపరిష్కారం జరిగి వాటా కేటాయించినట్లయితే.. ఆ ఆస్తిపై మాత్రమే హక్కు ఉంటుందని తెలిపింది. దత్తతకు వెళ్లకముందు ఎలాంటి కేటాయింపులు లేకపోతే జన్మించిన కుటుంబానికి చెందిన ఆస్తిలో వాటా ఉండదంటూ 44 పేజీల తీర్పును తెలంగాణ హైకోర్టు వెలువరించింది.