తొలిసారి తెలుగులో తీర్పు చెప్పిన తెలంగాణ హైకోర్టు
X
తెలంగాణ హైకోర్టు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తెలుగులో తొలి తీర్పు వెల్లడించింది చరిత్ర సృష్టించింది. ఉమ్మడి హైకోర్టు చరిత్రలోనూ ప్రాంతీయ భాషలో ఉత్తర్వులు రావడం ఇదే మొదటి సారి. సికింద్రాబాద్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి వివాదంపై జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ఈ నెల 27న 45 పేజీల తీర్పును తెలుగులో ఇచ్చింది. స్థానిక భాషల్లో కేరళ తరువాత తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు మాత్రమే కావటం విశేషం.
సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో మొత్తం ఇంగ్లీష్ భాషలోనే వ్యవహారాలుంటాయి. పిటిషన్‌లు దాఖలు చేసినప్పుడు అనుబంధ డ్యాక్యుమెంట్లు, ఆధారాలు స్థానిక భాషలో ఉన్నప్పటికీ వాటిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లెట్ చేసి కోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలి. సుప్రీం కోర్టు కీలక తీర్పులను ఈ మధ్య స్థానిక భాషల్లోకి ట్రాన్స్‌లెట్ చేయిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులు కూడా స్థానిక భాషలో తీర్పు వెలువరించడానికి ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక భాషల ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా కోర్టులు కూడా మాతృభాష వైపు అడుగులు వేయడం ప్రారంభించాయి.
ఫర్యాదుదారుల, ప్రజల సౌలభ్యం కోసం తెలుగులో వెలువరించామన్న ధర్మాసనం.. ఏ సందేహాలున్నా వాటి నివృత్తికి ఆంగ్లంలోని తీర్పును పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. కేసుకు సంబంధించిన అంశాలే కాకుండా తమకేసును రుజువు చేసుకునేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సమర్పించిన సుప్రీంకోర్టు తీర్పులను న్యాయస్థానం తెలుగులో అనువదించింది. భవిష్యత్‌లో తెలుగులో మరిన్ని తీర్పులు వెలువరించేందుకు.. ఇది తొలి అడుగుగా భాషాభిమానులు చెబుతున్నారు.