Singareni Elections : సింగరేణి ఎన్నికలు వాయిదా.. హైకోర్టు కీలక ఆదేశాలు..
X
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. (Singareni Elections) ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్లో కోరింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం డిసెంబర్ 27కు ఎన్నికలను వాయిదా వేసింది. నవంబర్ 30లోపు ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని యజమాన్యాన్ని ఆదేశించింది.
కేంద్ర కార్మికశాఖ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 28న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా అయిపోయింది. 14గుర్తింపు సంఘాలు నామినేషన్లను దాఖలు చేశాయి. అయితే ఈ నెల 9న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కాగా 2019లోనే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ఏదో కారణంతో వాయిదా వేస్తూ వస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దానికి అనుగుణంగా సీఎల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో మరోసారి వాయిదా పడ్డాయి.