త్యాగాలకు ప్రతిబింబం.. అమరుల స్మారక చిహ్నం..
త్యాగాలకు ప్రతిబింబం.. అమరుల స్మారక చిహ్నం..
X
తెలంగాణ అమరుల త్యాగాల ప్రతిబింబం.. తరతరాలకు స్ఫూర్తినిచ్చే అమరవీరుల స్మారక చిహ్నం.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మించిన అమర జ్యోతి. అమరుల త్యాగాలే పునాదులుగా, వారి జ్ఞాపకాలను ఇటుకలుగా పేర్చి రూపొందించిన కట్టడం. 150 అడుగుల ఎత్తులో దేదీప్యమానంగా వెలుగుతున్నట్లు కనిపించి ఈ జ్యోతి అందరి దృష్టి ఆకర్షిస్తోంది. హుస్సేన్‌సాగర్ తీరాన ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ స్మారక కేంద్రం ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా రూపుదిద్దుకుంది.
ప్రజ్వలించే దీపం
తెలంగాణ సాధనలో అమరులైన వారికి గుర్తుగా అమరవీరుల స్మారక కేంద్రం నిర్మించాలని భావించిన సీఎం కేసీఆర్ 2017 జూన్‌లో దానికి శంకుస్థాపన చేశారు. తొలుత నక్షత్రం ఆకారంలో నిర్మించాలని భావించారు. ఆ తర్వాత అనేక ఆకృతులను పరిశీలించిప్రజ్వలించే దీపం ఆకారంలో కట్టాలని నిర్ణయించారు. మిర్రర్ ఇమేజ్ స్టెయిన్ లెస్ స్టీలుతో ఈ స్మారకాన్ని నిర్మించారు. ఇందుకోసం రూ.178 కోట్లు ఖర్చు చేశారు. హుస్సేన్‌సాగర్‌కు ఆనుకుని ఉండటంతో భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా పునాదులు, బేస్‌మెంట్ల నిర్మాణం నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రాజెక్టు విశేషాలు
ప్రాజెక్టుకు కేటాయించిన ప్రాంతం : 3.29 ఎకరాలు
బిల్డింగ్ నిర్మించిన ప్రాంతం: 2.88 లక్షల చదరపు అడుగుల్లో
బిల్డింగ్లోని అంతస్తులు : 6
స్మారక చిహ్నం ఎత్తు : 54 మీటర్లు
దీపం ఎత్తు: 26 మీటర్లు
స్టెయిన్ లెస్ స్టీల్ : 100 మెట్రిక్ టన్నులు
ఉక్కు : 1500 మెట్రిక్ టన్నులు
ప్రాజెక్ట్ వ్యయం: రూ.178 కోట్లు
కాంట్రాక్టు కంపెనీ: కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్
కన్సల్టెంట్: ఎంవీ రమణా రెడ్డి, తనికెళ్ల ఇంటిగ్రేటెడ్ కన్సల్టెంట్స్
ఏ ఫ్లోర్లో ఏమున్నాయంటే..
గ్రౌండ్ ఫ్లోర్ - బుక్, ఇతర ఎగ్జిబిషన్ల కోసం స్థలం
ఫస్ట్ ఫ్లోర్ - మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడియో విజువల్ రూమ్
సెకండ్ ఫ్లోర్ - కన్వెన్షన్ హాల్, లాబీ ఏరియా
థర్డ్ ఫ్లోర్ - రెస్టారెంట్, ఓపెన్ టెర్రస్ సిట్టింగ్ ఏరియా
రెండు బేస్మెంట్లలో పార్కింగ్
దుబాయ్‌లో తయారుచేసి
దీపం ఆకృతిలో రూపుదిద్దుకున్న స్మారకం నిర్మాణానికి ఎలాంటి అతుకులు కనిపించకుండా జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న ప్రత్యేక స్టీలును ఉపయోగించారు. దుబాయ్‌లోని గ్రాన్‌క్రాఫ్ట్ సంస్థ ఆ స్టీలును మౌల్డింగ్ చేసి హైదరాబాద్‌కు తరలించింది. ఆ తర్వాత వాటిని ఒక క్రమపద్దతిలో అమర్చారు. దీపం ఆకృతి కోసం దాదాపు 100 టన్నుల స్టీలును, వెలుగుతున్న ఒత్తి నిర్మాణానికి కార్బన్ స్టీలు వినియోగించారు. దీపపు కాంతి చూపరులను ఆకట్టుకునేలా కింది నుంచి ప్రత్యేక విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు.
వేడెక్కకుండా ప్రత్యేక టెక్నాలజీ
స్టీల్ తో నిర్మించినప్పటికీ భవనం వేడెక్కకుండా పఫ్ మెటీరియల్, సపోర్టింగ్ జీఆర్సీ షీట్‌లు ఉపయోగించారు. ఇంత పెద్ద అతుకులు లేని స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణం ప్రపంచంలో మరెక్కడా లేదు. హుస్సేన్‌సాగర్ ఒడ్డున నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుండగా, అమరుల స్మృతి చిహ్నం మరో పర్యాటక కేంద్రంగా మారనుంది. ఒకవైపు సెక్రటేరియెట్ మరోవైపు హుస్సేన్‌సాగర్, మధ్యన రూపుదిద్దుకున్న అమరవీరుల స్మారకం హైదరాబాద్ నగరానికి మరింత శోభను చేకూర్చనుంది.