గాలమేసి చేపలు పట్టిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ దశాబ్ది వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గురువారం చెరువుల పండుగ గ్రామాల్లో సందడిగా కొనసాగుతోంది. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొంటూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన చెరువుల పండుగ కార్యక్రమాల్లో పాల్గొని మంత్రి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి , బతుకమ్మలని చెరువుల్లో వదులుతూ, కట్టమైసమ్మల దగ్గర పూజలు నిర్వహిస్తూ, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా పెద్ద వంగర మండలం గంట్ల కుంట గ్రామ సమీపంలో మృగశిర కార్తె సందర్భంగా కుంట కట్ట చెరువు వద్ద చేపలు పడుతున్న జాలర్లు మంత్రి కంటపడ్డారు. వెంటనే తాను ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని ఆపి వారితో ముచ్చట్లు పెట్టారు మంత్రి. చేపలు పడ్డాయా? అంటూ ఆరా తీశారు. ఇప్పుడే పడుతున్నాం అని వారు చెప్పడంతో తాను కూడా చేపలు పట్టడానికి చెరువులోకి దిగారు.
జాలర్లతో కలిసి తాను జాలరయ్యారు మంత్రి. వేసుకున్న ప్యాంటు ను పైకి లాగి, నేరుగా చెరువులోకి దిగి స్థానకులను ఆశ్చర్యపరిచారు. వల ఒకవైపును మంత్రికి అందించారు. మరో వైపు జాలర్లు వలను పట్టుకున్నారు. అంతా కలిసి వల విసిరి చేపలు పట్టారు. అందులో పడ్డ చిన్నచిన్న, కాస్త పెద్ద చేపల్ని చూసి ఎర్రబెల్లి సంబురపడ్డారు. అలా ఒకటికి రెండుసార్లు వల విసిరి చేపలు పట్టి కొద్దిసేపు వారితో గడిపారు. చేపల ద్వారా వారి ఆదాయ మార్గం ఎలా ఉంది? వంటి వివరాలు జాలర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నీటితో చెరువులను నింపి, ఆ నీటిలో ఉచితంగా చేపలు వేసి, జాలర్లకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించడమే కాక, ఆదాయ మార్గాన్ని చూపించిందని మంత్రి వారికి తెలిపారు. ఇదంతా సీఎం కేసీఆర్ కృషి వల్లే సాధ్యమైందని చెప్పారు. తెలంగాణకు పూర్వవైభవం తెచ్చి అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ కి అండగా ఉండాలని వారిని కోరారు. మత్రి చేపలు పట్టిన వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.