దేశంలో 44 శాతం ఉద్యోగాలు హైదరాబాద్ నుంచే.. కేటీఆర్
X
హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం తమ ప్రభుత్విం అహర్నిశలు కృషి చేస్తోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. భాగ్యనగరం దేశంలో కొలువులకు నెలవుగా మారిందని, కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు మరింత సహకారం అవసరమని చెప్పారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర అంశాలపై చర్చించడానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్దీప్ సింగ్ పూరీల అపాయింట్‌మెంట్ కోరానని తెలిపారు. రాష్ట్ర ప్రగతిని వివరించిన ఆయన తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతోందని మండిపడ్డారు.
ఆ భూములు ఎందుకివ్వం లేదు?
‘‘హైదాబాద్ శరవేగంగా విస్తరిస్తున్న నగరం. దేశంలో 44 శాతం ఉద్యోగాలు హైదరాబాద్ నుంచే దక్కుతున్నాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో, బయోటెక్ ఐటి ఏరోస్పేస్ రంగాల్లో దూసుకుపోతోంది. స్కై కారిడార్లు నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇచ్చి సహకరించాలని తొమ్మిదేళ్లలో ఐదుగురు రక్షణ మంత్రులు 20 సార్లు కలిశాం. ఇప్పటికీ కేంద్రానికి మనసు రావడం లేదు. 56 ఎకరాల రక్షణ భూములు ఇస్తే బదులుగా రాష్ట్ర ప్రభుత్వ భూములు ఇస్తామని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా మార్చడానికి 142 లింక్ రోడ్లు నిర్మించాలని ప్రణాళిక వేశాం. మెట్రో రెండో దశ, ఎయిర్ పోర్ట్ అనుసంధాన మెట్రోపై కేంద్రంతో చర్చిస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని, అమరులకు అభివృద్ధే అసలైన నివాళి అని అన్నారు.
కిషన్ రెడ్డి జవాబు చెప్పాలి?
తెలంగాణకు కేంద్రం ఎంతో చేసిందని చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్దాలాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డాడరు. ఉత్తర ప్రదేశ్‌లో 10 చిన్న పట్టణాలకు మెట్రో సర్వీసులు కేటాయించిన కేంద్రం హైదరాబాద్ మెట్రోకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి అవకాశం దొరికితే ఢిల్లీని కూడా తీసుకెళ్లి గుజరాత్‌లో పెడతారని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రో మోదీ అత్యంత బలహీన ప్రధాని అని దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక నిర్మిస్తామన్నారు.