Home > తెలంగాణ > స్వరాష్ట్రంలో నేతన్నలకు సర్కార్ అండగా ఉంటుంది..మంత్రి కేటీఆర్

స్వరాష్ట్రంలో నేతన్నలకు సర్కార్ అండగా ఉంటుంది..మంత్రి కేటీఆర్

స్వరాష్ట్రంలో నేతన్నలకు సర్కార్ అండగా ఉంటుంది..మంత్రి కేటీఆర్
X

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్‎లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. అంతకుముందు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశిస్తూ కేటీఆర్ ప్రసంగించారు.

కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..."స్వరాష్ట్ర సాధన మహోద్యమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన విద్యార్థి అమరవీరులకు మన అందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాను. దశాబ్ది ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకోవడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో 9 ఏళ్లలోనే రాష్ట్రం ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. ప్రజా సంక్షేమంలో, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించదగిన విషయం ఇది. తెలంగాణ మోడల్ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలను అందుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో రాజన్న సిరిసిల్లా జిల్లా తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంది. అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోంది. 10 ఏళ్ల లో నేతన్నల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి".

" ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు నేత కార్మికుల జీవితాలు గాలిలో దీపంలా ఉండేవి. చేనేత కార్మికులకు చేతినిండా పనికి దొరికేది కాదు. విక్రయాలు లేక పరిస్థితి దారుణంగా ఉండేది. మద్దతు ధర లభించక, చేనేత రంగం కృషించిపోయింది. అలాంటి పరిస్థితి నుంచి నేడు నేతన్న ఆర్థిక పురోగతి వైపు పయనిస్తున్నాడు. స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కార్ అన్నివేళల్లో నేతన్నలకు మద్దతుగా నిలుస్తోంది. నేతన్నలకు నిరంతరం ఉపాధి కల్పించడానికి రూ.2500 కోట్ల విలువైన బతుకమ్మ చీరల ఉత్పత్తి చేసింది. క్రిస్మస్, రంజాన్‌ సమయాల్లోనూ చీరల ఉత్పత్తి కోసం ఇక్కడి పవర్‌లూం వర్కర్స్‌కే ఇస్తున్నది. ఈ ఆర్డర్ల వల్ల 15వేలకు పైగా కార్మికులు ప్రతి నెల రూ.16వేలకు పైగా జీతాన్ని పొందుతున్నారు".

" నేతన్నల కోసం తొలిసారిగా ప్రభుత్వం బీమా పథకాన్ని తీసుకువచ్చింది. సిరిసిల్లలోనే కాదు తెలంగాణలోని దాదాపు 8వేల మంది నేత, పవర్‌లూం వర్కర్లకు ఈ బీమా వర్తిస్తుంది. చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా అందిస్తోంది. నేత కార్మికుల సంక్షేమం కోసం పాటుపడున్న ప్రభుత్వం మనది. ఎన్ని కష్టాలు ఎదురైనా చేనేత రంగంపై ఆధారపడ్డ కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నాం". అని ఆయన తెలిపారు.


Updated : 2 Jun 2023 1:07 PM IST
Tags:    
Next Story
Share it
Top