పర్యాటకులకు అలర్ట్.. 'బొగత' సందర్శన నిలిపివేత
X
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ నయాగారా బొగత జలపాతం పరవళ్ళు తొక్కుతోంది. మూడు రోజులుగా ఛత్తీస్‌గఢ్‌తోపాటు (Chattisgah) స్థానికంగా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం.. జలకళ సంతరించుకున్నది. 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతూ పాలసంద్రంలా మారి కనువిందు చేస్తుండటంలో పెద్ద సంఖ్యలు పర్యాటకులు తరలివస్తున్నారు. అయితే భారీ వర్షాలు, వరద ఉధృతి పెరడటంతో జలపాతం సందర్శనను నిలిపివేస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. నేటి నుంచి బొగత సందర్శనకు అనుమతి లేదని ఎఫ్ఆర్వో చంద్రమౌళి తెలిపారు.
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అటవి ప్రాంతంలో గత మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షానికి.. ములుగు అటవి ప్రాంతం కొండాకోనల నుంచి జాలువారిన వరదనీరు వాగులు వంకల గుండా ప్రవహిస్తూ బొగతలోకి భారీగా వరద పోటెత్తుతోంది. ఇప్పటికే బొగత వద్ద వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటం.. రానున్న మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంకటాపురం డివిజన్ అటవీశాఖ అధికారులు బొగత జలపాతానికి వచ్చే సందర్శకుల రాకను నిలిపివేశారు.
మరోవైపు వెంకటాపురం మండలంలోని పాలెం వాగు మధ్యతరహా జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వరద ప్రవాహానికి నాలుగు గేట్లు ఎత్తి 6750 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిపారుదలశాఖ అధికారులు విడుదల చేశారు.