Home > తెలంగాణ > వచ్చే పంటకాలం నుంచి PMFBY ద్వారా తెలంగాణలో పంటల బీమా

వచ్చే పంటకాలం నుంచి PMFBY ద్వారా తెలంగాణలో పంటల బీమా

PMFBYలో తిరిగి చేరిన తెలంగాణ

వచ్చే పంటకాలం నుంచి PMFBY ద్వారా తెలంగాణలో పంటల బీమా
X


తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ప్రకృతి వైపరిత్యాలు, ఊహించని సంఘటనల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో 2016 జూన్ నుంచి కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నది. ఈ స్కీమ్ లో భాగంగా రైతులు స్వల్ప మొత్తంలో పంటల ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ పథకం అన్నదాతలకు మేలు కంటే భారమే ఎక్కువ అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఈ స్కీమ్ ను నుంచి 2020లో వైదొలిగింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి పంట బీమా పథకం అమలు కావడం లేదు. దీంతో ప్రకృతి వైఫరిత్యాల కారణంగా పంట నష్టం జరిగినా రైతులకు ఎలాంటి పరిహారం అందని పరిస్థితి నెలకొంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తినా కేసీఆర్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన స్కీమ్ లో చేరుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నది. శుక్రవారం రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవ‌సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర‌ రావు.. పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్యద‌ర్శి రితేష్ చౌహాన్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా.. రైతుల‌కు ద‌న్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బ‌లోపేతం చేయ‌డ‌మే కాంగ్రెస్ ప్రభుత్వ ల‌క్ష్యమ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు రంగంలోని ప్రతికూల‌త‌లు త‌ట్టుకుంటూ రైతులకు ర‌క్షణగా నిలిచేందుకు ప్రధానమంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న (PMFBY)లో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేరుతున్నట్టు ప్రకటించారు.

పీఎంఎఫ్‌బీవైలోకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగిచేర‌టంతో వ‌చ్చే పంట కాలం నుంచి రైతులు ఈ ప‌థ‌కం నుంచి పంట‌ల బీమా పొంద‌నున్నారు. పీఎంఎఫ్ బీవైతో రైతుల‌కు ప్రయోజ‌నం క‌లుగుతుంద‌ని.. పంట‌లు న‌ష్టపోయిన‌ప్పుడు స‌కాలంలోనే ప‌రిహారం అందుతుంద‌ని రితేష్ చౌహాన్ తెలియ‌జేశారు. రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధిలో రైతు కేంద్ర విధానాల అమ‌లుకు ప్రాధాన్యం ఇస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా ఈ స్కీమ్ కింద ఒక్క రైతు బీమా చేయించుకున్న మొత్తంలో కొంత శాతం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఖరీఫ్ సీజన్ లో ఆహార ధాన్యాలు (వరి, గోధుమ, పప్పు ధాన్యాలు, నూనెగింజలు)కు సంబంధించి బీమా చేయించుకున్న మొత్తంలో 2 శాతాన్ని రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వాణిజ్య పంటల కోసం బీమా మొత్తంలో 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అదే రబీ సీజన్ లో ఆహార ధాన్యాలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రారంభంలో రైతులు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు తీసుకునేటప్పుడు ఈ పథకంలో చేరాలని కచ్చితమైన నిబంధన నియమించారు. తర్వాత దీనిని ఆప్షనల్ గా మారుస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది.


Updated : 1 March 2024 9:34 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top