Home > తెలంగాణ > LRS: 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

LRS: 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

LRS: 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
X

తెలంగాణలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్..( లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (LAYOUT REGULARIZATION SCHEME- 2020))దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోపు వచ్చిన దరఖాస్తుదారులకు లే-అవుట్ ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప… ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించనున్నారు. ఈ నిర్ణయంతో.. 20 లక్షల మంది దిగువ, మధ్య తరగతి వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు మేలు కలుగుతుంది.

అసలేంటీ ఎల్‌ఆర్‌ఎస్‌...?

అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిందే ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం). ప్రభుత్వ విధివిధానాలు పాటించకుండా నిర్మించిన లే అవుట్లు, అక్రమ స్థలాల్లో నిర్మించిన లే అవుట్లను అన్ అప్రూవుడ్ లే అవుట్లు అంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇలాంటి స్థలాలను తప్పకుండా క్రమబద్ధీకరించుకోవాలి. ఇందుకోసం 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. క్రమబద్దీకరణ పేరుతో ఛార్జీలు వసూలు చేసేలా ఎల్ఆర్ఎస్-2020 (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2020) మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఆ ఛార్జీలు తమకు భారంగా మారాయంటూ.. ఈ విషయంపై కొందరు కోర్టులను ఆశ్రయించడంతో కొంతకాలం నుంచి ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడింది.

ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) ఛార్జీలు తమ భరించలేనంతగా ఉంటున్నాయని ఇప్పటికీ వాపోతున్నారు నగరంలోని పేదలు. ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని.. ఎల్ఆర్ఎస్ ఛార్జీలు కట్టి.. ఇంటిని నిర్మించుకోవాలంటే తలకు మించిన భారమవుతోందని అంటున్నారు. 150 గజాల స్థలానికి ఇంటి నిర్మాణ అనుమతి కావాలంటే తక్కువలో తక్కువగా రూ.10లక్షల ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించాల్సిందే. 100గజాల స్థలమైనా సరే.. కనిష్ఠంగా రూ.5లక్షల ఛార్జీ పడుతోంది. ఆ భయంతో 99 శాతం మంది బస్తీవాసులు అనుమతి లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారు. మరికొంతమంది అయితే ఉన్న డబ్బులన్నీ ఎల్ఆర్ఎస్ చార్జీలకే పోతే.. ఇక ఇల్లు కట్టుకునేదెట్లా అని ఆ ఇంటి నిర్మాణ అనుమతి ఆలోచననే విరమించుకుంటున్నారు. అయినా కిక్కిరిసిపోయిన బస్తీల్లో, పాత కాలం ఊళ్లలో చేపట్టే నిర్మాణాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము వసూలు చేయడమేంటనే ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.

ఎల్ఆర్ఎస్ ఉద్దేశమే వేరు

నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో కేసీఆర్ ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది. ఈ పథకం మార్గదర్శకాల ప్రకారం.. అధికారిక లేఅవుట్‌లో పది శాతం స్థలాన్ని ఖాళీగా వదలాల్సి ఉంటుంది. కానీ.. అనధికారిక లేఅవుట్లలో అలా వదిలేయడానికి ఖాళీ స్థలం ఉండదు. దీంతో జనావాసాల్లో సరైన సౌకర్యాలు ఉండవని, అలాంటి లేఅవుట్లలోని ఇళ్ల స్థలాల నుంచి 0.14శాతం ఓపెన్‌ ల్యాండ్‌ ఛార్జీలను వసూలు చేయాలని తెలిపింది. ఆ డబ్బుతో కొంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి.. అనధికార లేఅవుట్‌లోని కాలనీకి కేటాయించాలన్నది ముఖ్య ఉద్దేశం. కానీ.. జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం... ఇప్పటివరకూ కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ను ఆదాయ వనరుగానే చూస్తోంది తప్ప ఇంతవరకూ ఏ కాలనీకి ఖాళీ స్థలాన్ని కేటాయించిన దాఖలాలు లేవు. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు రూ.100కోట్లకుపైగా రుసుము వసులు చేయగా, అందులో ఒక్క రూపాయిని కూడా ఉద్దేశించిన లక్ష్యం కోసం వెచ్చించలేదు.

అయితే.. రాష్ట్రంలో లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద దరఖాస్తు చేసుకున్న దాదాపు 20 లక్షల మంది గత మూడున్నరేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఇంటి నిర్మాణం మొదలెడదామని వేచి చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం.. ముగింపు పలికినట్లయింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఔట్‌లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకుమార్చి 31 వరకు వీలు కల్పించింది. ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రూ.10 వేల కోట్ల ఆదాయం

ఎల్‌ఆర్‌ఎస్‌కు ధరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, చెరువు శిఖం భూములలో ఉన్న లే అవుట్లకు అనుమతి ఇవ్వకూడదని, వాటిని స్కీంలో నుంచి తొలగించారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సైతం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు అనుమతించలేదు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించి లే ఔట్‌లను వేయడంతో ప్రభుత్వ భూములను, చెరువు శిఖం భూములను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం అనుమతి లేని లే ఔట్లను మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం ద్వారా రెగ్యులరైజేషన్‌ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తుల్లో అర్హమైన వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

Updated : 26 Feb 2024 11:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top