Prabhakara Rao Resigned : ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ పదవికి ప్రభాకర్ రాజీనామా
X
తెలంగాణలో ప్రభుత్వం మారబోతుంది. నిన్నటి వరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓడిపోవడంతో.. కాంగ్రెస్ అధిష్టానం తమ ప్రభుత్వానికి ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర రావు రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత జూన్ 5, 2014న ఆయన తెలంగాణ విద్యుత్ ఉత్పాదన సంస్థ(టీ-జెన్‌కో) సీఎండీగా విద్యుత్‌సౌధలో బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది అక్టోబర్ 25న ట్రాన్స్‌కో ఇన్‌చార్జిగా నియమితులయ్యారు.
తొలుత ఆయన్ను రెండేండ్ల పదవీ కాలానికి సీఎండీగా ప్రభుత్వం నియమించినప్పటికీ.. తర్వాత పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నది. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 54 ఏండ్లపాటు సంస్థకు సేవలు అందించారు. తన పదవీ కాలంలో విద్యుత్ శాఖకే ఆయన వెలుగులు పంచి వన్నె తెచ్చారు. అయితే వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ గా ప్రభాకర్ రావు కొనసాగుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్యలు సాగుతున్న తరుణంలో ప్రభాకర్ రావు రాజీనామాను సమర్పించారు.