Kokapet land auction : కోకాపేట భూముల ధరలకు రెక్కలు..ఎకరం ఎంతంటే..?
X
కోకాపేట భూములకు ఆన్లైన్ వేలం కొనసాగుతోంది. హెచ్ఎండీఏ సారథ్యంలో నియోపోలిస్ ఫేజ్ 2 భూముల వేలం గురువారం ఉదయం నుంచి జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోకాపేట భూముల ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. ప్లాట్ నెం.9లోని ఎకరం భూమి కనీవిని ఎరుగని రీతిలో దాదాపు రూ.70.25 కోట్లు పలికింది. మొదటి విడతలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 26.86 ఎకరాలకు వేలం వేయగా నాలుగు ప్లాట్లు రూ.1,469 కోట్లు పలికాయి. ఈ భూములకు గాను రూ.35 కోట్లు కనీస ధర నిర్ణయించగా వేలంలో అంచనాలకు మించి ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వస్తోంది. ఈ వేలంలో అత్యధికంగా ఎకరం భూమి రూ.72 కోట్లు పలకగా, అత్యల్పంగా రూ.51.75 కోట్లు పలికింది.
నిధుల సమీకరణలో భాగంగా హెచ్‌ఎండీఏ కోకాపేట భూముల అమ్మక ప్రక్రియను చేపట్టింది. ఈ రోజు జరిగిన ఈ ప్రక్రియలో రికార్డుస్థాయిలో భూముల ధరలు పలికాయి. కోకాపేట భూముల్లో 6,7,8,9 ప్లాట్లకు వేలం వేయగా గజం భూమి ధర రూ.1.5 లక్షల వరకు పలికింది. మొదటి విడతగా హెచ్ఎండీఏ 26 ఎకరాలకు పైగా భూమిని వేలం వేయగా 1,532 కోట్లకు పైగా ఆదాయాన్ని సమీకరించింది. మొత్తంగా 45 ఎకరాల్లో ఉన్న ఏడు ప్లాట్‌లతో రూ.2,500 కోట్ల సమీకరించాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది.