Home > తెలంగాణ > సాగర్‌ డ్యామ్‌ అక్కడే ఉంటుంది..నీళ్లు ఎక్కడికి పోవు : రేవంత్‌ రెడ్డి

సాగర్‌ డ్యామ్‌ అక్కడే ఉంటుంది..నీళ్లు ఎక్కడికి పోవు : రేవంత్‌ రెడ్డి

సాగర్‌ డ్యామ్‌ అక్కడే ఉంటుంది..నీళ్లు ఎక్కడికి పోవు : రేవంత్‌ రెడ్డి
X

నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటాక అక్రమంగా చొరబడి డ్యామ్‌కు ముళ్లకంచెను ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రాజెక్టు 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన అధికారులు దాదాపు 500 మంది పోలీసు సిబ్బందితో సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్పీఎఫ్‌ సిబ్బందిపై దాడి చేశారు. భద్రతా సిబ్బంది మొబైల్‌ ఫోన్లతో పాటు డ్యామ్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. 13వ గేట్‌ వద్దకు చేరుకొని ముళ్ల కంచె ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాజాగా

ఈ వివాదంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు.

కావాలనే ఈ వివాదం సృష్టించారు : రేవంత్ రెడ్డి

ఎవరో కావాలనే వ్యూహాత్మకంగా ఈ వివాదాన్ని సృష్టించారని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం ఆశించి ఎవరు ఈ వివాదం సృష్టిస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని, తెలంగాణ ప్రజలకు ఇది బాగా తెలుసునని అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి కుట్రలు తెలంగాణ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.

సాగర్‌ డ్యామ్‌ అక్కడే ఉంటుందని, నీళ్లు ఎక్కడికి పోవని చెప్పారు. ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని రేవంత్ సూచించారు. ఈ వివాదంపై తక్షణమే సీఈవో చర్యలు తీసుకోవాలని కోరారు.

తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్‌ సర్కార్ సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

Updated : 30 Nov 2023 9:59 AM IST
Tags:    
Next Story
Share it
Top